CPI state secretary K Ramakrishna: ప్రైవేటీకరణపై ఉద్యమించాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:16 AM
విద్యా, వైద్య రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు...
గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విద్యా, వైద్య రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు ఏసీ కళాశాలలో శనివారం జరిగిన ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘పీపీపీ విధానంలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతుంది’ అని రామకృష్ణ అన్నారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నాయకుడు రమేశ్ పట్నాయక్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యను కాషాయీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని అన్నారు. ప్రముఖ వైద్యుడు ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలు ఏర్పడితే ప్రభుత్వ ఆస్పత్రులు కూడా వస్తాయని, పేదలకు ఉచిత వైద్యం అందుతుందని అన్నారు. ఏఐఎ్‌సఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 77 రద్దు చేసి ప్రైవేట్ పీజీ, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేయాలన్నారు. సమస్యలపై 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు అధ్యక్షత వహించారు.