అది బూటకపు ఎన్‌కౌంటర్: ఈశ్వరయ్య
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:23 AM
వైద్య అవసరాల కోసం విజయవాడ వచ్చిన మావోయిస్టులను పట్టుకుని తీసుకుపోయి పోలీసులు కాల్చి చంపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు.
అమరావతి, నర్సీపట్నం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): వైద్య అవసరాల కోసం విజయవాడ వచ్చిన మావోయిస్టులను పట్టుకుని తీసుకుపోయి పోలీసులు కాల్చి చంపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేంద్ర, రాష్ట్ర బలగాలు ఎన్‌కౌంటర్ జరిగిందని ప్రకటిస్తున్నాయి. అది వాస్తవం కాదు. నిరాయుధులుగా ఉన్న మావోయిస్టులను కాల్చి చంపారు. హిడ్మా కుటుంబ పరిస్థితి చూసిన తర్వాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అడవుల్లోని ఖనిజ సంపదను దోచుకుపోవడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో 1,551 ఎంవోయుల చేసుకున్నామని, రూ.21 లక్షల కోట్లు పెట్టుబడులు, 20 లక్షలు ఉద్యోగాలు వచ్చేశాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో జరిగిన ఇటువంటి సదస్సులతో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు?’ అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మార్గం సుగమం కావడానికి కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణమని ఆరోపించారు. ‘కడప స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసినా అతీగతీ లేదు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు 2,500 మెడికల్ సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబరు 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ, లక్ష మందితో కవాతు నిర్వహిస్తాం’ అని ప్రకటించారు. కాగా, మరో ప్రకటనలో.... రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో పెట్టిన రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబుకి ఆయన లేఖ రాశారు.