CPI State Secretary Eshwarayya: వీఆర్‌ఏలను ఆదుకోండి
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:15 AM
రెవెన్యూ శాఖకు ప్రాణవాయువైన గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఆర్థిక ఇబ్బందులపై తక్షణమే సీఎం చంద్రబాబు స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.
సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య లేఖ
విజయవాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖకు ప్రాణవాయువైన గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఆర్థిక ఇబ్బందులపై తక్షణమే సీఎం చంద్రబాబు స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనిషి పుట్టుక నుంచి మ రణం వరకు రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏల పాత్ర కీలకం. బ్రిటీషు కాలం నుంచి నేటి వరకు పోలీసులతో సమానంగా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ వీఆర్‌ఏలు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. అయినా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పెరిగే ధరలకు అనుగుణంగా మూడు సంవత్సరాలకు ఒక్కసారైనా వేతనాలు, డీఏ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా వేతనంలో ఎలాంటి మార్పులేదు. ప్రభుత్వం వీఆర్‌ఏలతో వెట్టిచాకిరి చేయిస్తూ వేతనం మాత్రం పార్ట్‌టైం ఉద్యోగులకు ఇస్తున్నట్టు ఇవ్వడం బాధాకరం. తక్షణమే సీఎం చంద్రబాబు స్పందించి పేస్కేల్ మంజూరు చేసి, వారిని రెగ్యులర్ చేయాలి’ అని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.