Share News

CPI: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:44 AM

తెలుగు ప్రజల త్యాగాలతో ఏర్పాటై జాతికి గర్వకారణంగా, స్వావలంబనకు చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర మహాసభ డిమాండ్‌ చేసింది.

CPI: విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ వద్దు

  • ఆ ఆలోచన వెంటనే విరమించుకోవాలి.. సీపీఐ రాష్ట్ర మహాసభ డిమాండ్‌

  • మహాసభలో మొత్తం 64 తీర్మానాలు

  • బీజేపీ చెప్పుచేతల్లో రాజ్యాంగ వ్యవస్థలు: డి.రాజా

ఒంగోలు, ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల త్యాగాలతో ఏర్పాటై జాతికి గర్వకారణంగా, స్వావలంబనకు చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర మహాసభ డిమాండ్‌ చేసింది. అందుకోసం తీసుకుంటున్న చర్యలను తక్షణం నిలిపివేయాలని కోరింది. ఒంగోలులో జరుగుతున్న పార్టీ 28వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై చర్చించి తీర్మానాలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ నాయకుడు ఎం.ఆదినారాయణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ సిఫారసులకు అనుగుణంగా పేదలకు భూ పంపిణీ చేయాలని, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాసభ తీర్మానించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి, సౌకర్యాలు కల్పించాలని మహాసభ కోరింది. లులూ సంస్థకు ఆర్టీసీ స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తెచ్చిన 133 జీవోను తక్షణం రద్దు చేయాలని, స్త్రీ శక్తి (ఉచిత బస్సు) పథకం విజయవంతానికి 3వేల కొత్త బస్సుల కొనుగోలు చేయాలని, పది వేల మంది సిబ్బందిని నియమించాలని, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని, నీటి హక్కులకు భంగం కలగకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మహాసభ కోరింది. వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, దానిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి అదనపు భూసేకరణను వ్యతిరేకించింది. మహాసభలో మొత్తం 64 తీర్మానాలు చేశారు.


ట్రంప్‌ డైరెక్షన్‌లో మోదీ ప్రభుత్వం:డి.రాజా

మహాసభ ముగింపు సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకొని పాలిస్తోందని ధ్వజమెత్తారు. సీపీఐ స్వతంత్ర బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత, విస్తరణపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ‘బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ సీపీఐ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో రచించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా రాజా ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో డి.రాజా మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ కారణాలతో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిని కూడా రాజకీయం చేస్తున్నారని, ట్రంప్‌ డైరెక్షన్‌లో మోదీ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజల ఓటు హక్కును కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సెప్టెంబరు 1న బిహార్‌లో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 21 నుంచి 25 వరకు చండీగఢ్‌లో సీపీఐ 25వ జాతీయ మహాసభలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందులో భాగంగా డిసెంబరు 26న ఖమ్మంలో భారీ ప్రదర్శన ఉంటుందని, డిసెంబరు 24, 25 తేదీల్లో వివిధ దేశాల ప్రతినిధులతో విజయవాడలో అంతర్జాతీయ సెమినార్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెలంగాణ కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


నేడు రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. పార్టీ నిబంఽధనల మేరకు రామకృష్ణ ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యదర్శి పదవిలో కొనసాగినందున ఇప్పుడు కొత్తవారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో నూతన రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య మధ్య పోటీ నెలకొంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసినట్టు తెలిసింది.

Updated Date - Aug 26 , 2025 | 06:44 AM