CPI Politburo Member Raghavulu: వేగంగా విద్యుత్ ప్రైవేటీకరణ
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:55 AM
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ఆస్తి 1,500 రెట్లు, అంబానీ ఆస్తి 500 రెట్లు పెరిగింది. కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదు అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు
అదానీ చేతుల్లోకి నియంత్రణ.. భవిష్యత్‌లో ప్రజలపై మోయలేని భారం
ప్రపంచవ్యాప్తంగా సోషలిజంపై పెరిగిన ఆకర్షణ: రాఘవులు
విజయవాడలో రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు
విజయవాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ఆస్తి 1,500 రెట్లు, అంబానీ ఆస్తి 500 రెట్లు పెరిగింది. కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. తొలి సోషలిస్టు విప్లవ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘విద్యుత్ ప్రైవేటీకరణ చేసే పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే అదానీ చేతుల్లోకి పోతోంది. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలపై మోయలేని భారం పడుతుంది. ప్రపంచ పెత్తనం కోసం సామ్రాజ్యవాదం ఇప్పటి వరకు చేస్తున్న బెదిరింపులు, హెచ్చరికలన్నీ ఉడత ఊపులే. ప్రపంచవ్యాప్తంగా సోషలిజం పట్ల ఆకర్షణ పెరిగింది. ఇటీవల అమెరికాలో యువతపై నిర్వహించిన ఒక సర్వేలో 60 శాతం మంది సోషలిజం కావాలని కోరుకుంటున్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానంలో జీతాలు పెరుగుదలలో వైఫల్యం కనిపిస్తోంది. డాలర్ విలువ తగ్గుతోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తోంది. మరోవైపు ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసమే ప్రపంచంలోని అనేక దేశాలు మధ్య యుద్ధాలు జరుపుతోంది. ఇదే సమయంలో కమ్యూనిస్టు దేశాలు అన్ని అంశాల్లోను వేగంగా ముందుకు వెళుతున్నాయి’ అని రాఘవులు అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ, శ్రమకు తగ్గ వేతనం, ఉపాధి, జీవన భద్రత కావాలంటే సోషలిజంలోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, కె.శ్రీదేవి, ఎన్‌సిహెచ్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు.
కమ్యూనిస్టుల పునరేకీకరణ అవశ్యం: సీపీఐ
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులందరూ పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. వందేళ్ల కాలంలో దేశంలోని కమ్యూనిస్టు పార్టీ కీలకంగా లేకపోవడానికి, అధికారంలోకి రాకపోవడానికి పార్టీల చీలికే కారణమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేపాల్లో తొమ్మిది కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతతో ఉమ్మడిగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ఇదే తరహాలో భారత్‌లోనూ ఏకం కావాలని కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులు, వామపక్ష మేధావులు, కార్మికులు కోరుకుంటున్నారని చెప్పారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం ఈనెల 18న దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళనల్లో అన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నేతలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.