Share News

CPI Narayana: మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:25 AM

ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలనే మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు.

CPI Narayana: మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

  • దీన్ని కేంద్ర ప్రభుత్వం తన విజయంగా చెప్పుకోవడం విడ్డూరం

  • పెళ్లి చేసుకుని కాపురం చేయనన్న చందంగా కేసీఆర్‌, జగన్‌ల తీరు: నారాయణ

గుంటూరు(తూర్పు), సత్తెనపల్లి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలనే మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. గుంటూ రు, సత్తెనపల్లిలో జరిగిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. శాంతి చర్చలకు కోసమే తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ విజయంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరి ఉన్న నక్సలైట్లును టెర్రరిస్టులతో పోలుస్తున్న మోదీ, అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గిరిజనులను బెదిరించి సహజవనరులను కార్పొరేట్‌ శక్తులకు అప్పజేప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని, ఇది విజయవంతం అయ్యేందుకు సీపీఐ ఉద్యమాన్ని చేపడుతుందన్నారు. ఛండీగఢ్‌లో 21 నుంచి 25 వరకు జరిగే జాతీయ మహాసభల్లో అనేక అంశాలను చర్చించనున్నట్టు తెలిపారు. కేసీఆర్‌, జగన్‌లు అసెంబ్లీకి వెళ్లక పోవడం పెళ్లి చేసుకుని కాపురం చేయననే చందాగా ఉందని ఎద్దేవాచేశారు. శాసన సభ్యులుగా ప్రమాణం చేసి అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యే రాయితీలు, జీతాలు, డీఏలు తీసుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే ఒక లెక్క ఉంటుందని, దాని ప్రకారం మాత్రమే హోదా ఇస్తారన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 06:26 AM