Share News

Leadership Dispute: కామ్రేడ్లలో కుదరని ఏకాభిప్రాయం

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:17 AM

ప్రకాశం జిల్లా ఒంగోలులో మూడ్రోజులు నిర్వహించిన సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు సోమవారం రాత్రితో ముగిశాయి. అయితే మహాసభల ముగింపులో జరగాల్సిన రాష్ట్ర నూతన నాయకత్వ ఎన్నిక మాత్రం పూర్తి కాలేదు.

Leadership Dispute: కామ్రేడ్లలో కుదరని ఏకాభిప్రాయం

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక వాయిదా

ఒంగోలు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలులో మూడ్రోజులు నిర్వహించిన సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు సోమవారం రాత్రితో ముగిశాయి. అయితే మహాసభల ముగింపులో జరగాల్సిన రాష్ట్ర నూతన నాయకత్వ ఎన్నిక మాత్రం పూర్తి కాలేదు. పార్టీ రాష్ట్ర కమిటీకి కొత్త కార్యదర్శిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషంలో ఎన్నికను వాయిదా వేశారు. వచ్చే నెలలో చండీగఢ్‌లో జరిగే జాతీయ మహాసభల అనంతరం రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి నూతన కార్యదర్శిని ఎన్నుకుంటారు. అప్పటి వరకు ప్రస్తుత కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలోని పాత కమిటీయే కొనసాగనుంది. ఒంగోలులో ఈ నెల 23 నుంచి 25వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. చివరి రోజైన సోమవారం సాయంత్రం 101 మందితో రాష్ట్ర కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. దాని నుంచి రాష్ట్ర కార్యవర్గం, కార్యదర్శివర్గాన్ని.. కార్యదర్శివర్గంలో ఒకరిని కార్యదర్శిగా ఎన్నుకోవాలి. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, పార్టీ ప్రస్తుత సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కడప జిల్లాకు చెందిన యువనేత జి.ఈశ్వరయ్య ఆ పదవిని ఆశించారు. డి.రాజా, కార్యదర్శి నారాయణ సూచనలు, రామకృష్ణ ప్రతిపాదనతో ముప్పాళ్ల వైపు నేతలు మొగ్గు చూపారు. దీన్ని ఈశ్వరయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇప్పటి వరకు సహాయ కార్యదర్శిగా ఉన్న విశాఖకు చెందిన జేవీవీఎన్‌ మూర్తిని అదే పదవిలో కొనసాగిస్తూ ఈశ్వరయ్యను మరో సహాయ కార్యదర్శిగా నియమించాలని ప్రతిపాదించారు. దీనిపై అర్ధరాత్రి వరకూ గందరగోళం కొనసాగడంతో నారాయణ సీరియస్‌ అయ్యారు. అర్ధరాత్రి దాటాక ఓటింగ్‌, కౌన్సిల్‌లో చర్చకు ఆస్కారంలేదని.. ఎన్నికను వాయిదా వేయాలని సూచించారు. దీంతో సమావేశం వాయిదా పడింది.

Updated Date - Aug 27 , 2025 | 05:19 AM