AP CPI Leaders: ఉపాధిలో కేంద్రం వాటా తగ్గింపు సరికాదు
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:14 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వాటాను తగ్గించడం సమంజసం కాదని సీపీఐ పేర్కొంది. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథతథంగా అమలు...
బిల్లును వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించండి
చంద్రబాబుకు వినతిపత్రం అందించిన సీపీఐ నేతలు
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వాటాను తగ్గించడం సమంజసం కాదని సీపీఐ పేర్కొంది. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథతథంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుని కలసి వినతిపత్రం అందజేసింది. ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో జాతీయ సమితి సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. ‘ఇప్పటివరకు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 90 శాతం నిధులను 60 శాతానికి కుదించింది. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే ఏపీ సహా దేశంలోని పలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుంది. ఉపాధి పథకం కింద కల్పిస్తున్న పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదు. ఇప్పటివరకు పేదలకు హక్కుగా ఉన్న ఈ చట్టంలో సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కష్టంగా మారుతుంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో చేసిన సవరణలను వెంటనే వెనక్కి తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెట్టిన జాతిపతి మహాత్మాగాంధీ పేరును తొలగించి.. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్‌గా మార్చడం దుర్మార్గం. స్వచ్ఛ భారత్‌కు జాతి పితను కళ్ల జోడును వాడుకున్న ప్రధాని మోదీ... ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరి కాదు.
మహాత్ముని పేరుతో ఉపాధి పథకాన్ని కొనసాగించకపోతే పేదల వ్యతిరేకత ప్రభుత్వంగా ఎన్డీయే ముద్ర వేసుకుంటుంది’ అని బృందం సభ్యులు సీఎం దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ అంశంపై కేంద్ర పెద్దలతో చర్చిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సీపీఐ నాయకులు సచివాలయం బయట మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏపీలోనూ బీసీ జన గణన, కుల గణన చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు రామకృష్ణ వివరించారు. విద్య, వైద్యం, స్థానిక సంస్థల పదవుల్లో జనాభా ప్రాతిపదికన పదవులు కేటాయించాలని కోరామని చెప్పారు.