Share News

CPI Narayana: టెర్రరిస్టుల కంటే ఆర్థిక నేరస్థులు ప్రమాదకారులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 06:09 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ చేసిన ప్రకటనలో, ప్రధాని మోదీ విదేశాల్లో దాక్కున్న ఆర్థిక నేరస్థులను తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. దేశంలో లౌకికవాదం ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు

CPI Narayana: టెర్రరిస్టుల కంటే ఆర్థిక నేరస్థులు ప్రమాదకారులు

  • బీజేపీ రాకతో లౌకికవాదం ధ్వంసం

  • జేఈఈ రాయలేకపోయిన విద్యార్థులునష్టపోకుండా చూడాల్సిన బాధ్యత పవన్‌దే: నారాయణ

విశాఖపట్నం, నర్సీపట్నం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘ముంబై ఉగ్రదాడుల సూత్రధారి రాణాను అమెరికా నుంచి మన దేశానికి రప్పించగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో దాక్కున్న ఆర్థిక ఉగ్రవాదులను తీసుకురావడంలో విఫలమయ్యారు. టెర్రరిస్టుల కంటే ఆర్థిక నేరస్థులు చాలా ప్రమాదకారులు. రూ.16.5 లక్షల కోట్లు ప్రజల సొమ్ము కొల్లగొట్టి విదేశాలలో ఉన్న 29 మంది ఆర్థిక నేరస్థులను దేశానికి తీసుకువచ్చి శిక్షించాలి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం ‘రాజ్యాంగ రక్షణ, లౌకికవాదం... పరిరక్షణ’ అనే అంశం పై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అలాగే విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. ‘ప్రజా సంపదను దోచుకొని విదేశాలకు వెళ్లిపోయిన 29 మం దిలో 28 మంది గుజరాత్‌కు చెందినవారే. దేశంలో నిరర్థక ఆస్తుల విలువ బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి రూ.2.5 లక్షల కోట్లు ఉండగా, ఈ 11 సంవత్సరాల్లో రూ.16.5 లక్షల కోట్లకు పెరిగింది. మిత్రుడు అంటూనే సుంకాలతో ట్రంప్‌ దాడి చేస్తున్నందున నరేంద్ర మోదీ ఇప్పటికైనా యూరోపియన్‌ యూనియన్‌, చైనాతో కలిసి అమెరికా సుంకాలను తిప్పికొట్టాలి.


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లౌకిక వాదం ధ్వంసమయింది. లౌకిక వాదులమని చెప్పుకునే టీడీపీ, జనసేనలు... మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. భవిష్యత్తులో బీజేపీ వల్ల జరిగే నష్టానికి ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దేశంలోనే 11 సంవత్సరాల పాటు బెయిల్‌పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్‌ అన్నారు. మోదీ, అమిత్‌షాల ఆశీస్సులు లేకుండా అది సాధ్యం కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో పోలీసుల ఆంక్షలు, అత్యుత్సాహం కారణంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష రాయలేకపోయిన 30 మంది విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష రాయకపోవడం వల్ల సంవత్సరం వృథా అవుతుందన్నారు. వారు నష్టం పోకుండా చూడాల్సిన బాధ్యత పవన్‌ కల్యాణ్‌పై ఉంది’ అని నారాయణ సూచించారు.

Updated Date - Apr 12 , 2025 | 06:10 AM