Share News

National General Secretary D. Raja: మతతత్వ ఆర్‌ఎస్ఎస్‌తో రాజ్యాంగానికి హాని

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:32 AM

రాజ్యాంగానికి ఆర్‌ఎస్ఎస్‌తో హాని ఉంది. ఆ సంస్థది మతతత్వ విధానం. ఆర్‌ఎస్ఎస్‌ మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని అంగీకరించలేదు అని సీపీఐ...

National General Secretary D. Raja: మతతత్వ ఆర్‌ఎస్ఎస్‌తో రాజ్యాంగానికి హాని

  • రిజిస్ట్రేషన్‌, నిబద్ధత, బాధ్యత లేని సంస్థ అది

  • కార్పొరేట్ల నుంచి డబ్బు తీసుకున్న ఏకైక పార్టీ బీజేపీ

  • విజయవాడ మీట్‌ ది ప్రెస్‌లో డీ రాజా

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘రాజ్యాంగానికి ఆర్‌ఎస్ఎస్‌తో హాని ఉంది. ఆ సంస్థది మతతత్వ విధానం. ఆర్‌ఎస్ఎస్‌ మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని అంగీకరించలేదు’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యుజే నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీకి రిజిస్ట్రేషన్‌ ఉంది. మాకు బాధ్యత, నిబద్ధత ఉన్నాయి. అదే ఆర్‌ఎస్ఎస్‌కు రిజిస్ట్రేషన్‌ లేదు. దాంతోపాటే నిబద్ధత, బాధ్యత కూడా లేదు. బ్రిటీష్‌, ఫ్రెంచ్‌ లాంటి సామ్రాజ్యవాదులపై మా పార్టీ పోరాడింది. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ పాత్ర లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ విశ్వాసం కోల్పోయింది. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దేశంలో జరిగే ఎన్నికల్లో నిరంకుశత్వం ఉంది. సీఈసీ నియామకం ప్రధాని కనుసన్నల్లో జరగడమే దీనికి కారణం. దేశంలో సమగ్ర ఎన్నికల విధానం అమలు కావాలని మా పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రిస్తేనే నిష్పాక్షిక ఎన్నికలు జరుగుతాయి. బిహార్‌ ఎన్నికల తీరుపై పలు అనుమానాలున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్న కారణంతో ఓటర్ల జాబితాలో పలువురి పేర్లను తొలగించారు. ఎలక్టోరల్‌ బాండ్లను మాతోసహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. కార్పొరేట్ల నుంచి డబ్బులు తీసుకున్న ఏకైక పార్టీ బీజేపీ. బిహార్‌లో ఎన్డీయే గెలుపుతో ఇండియా బ్లాక్‌ పార్టీలు నిరాశకు లోనయ్యాయి. సెక్యులర్‌ పార్టీలన్నీ ఏకమై రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, బెంగాల్‌, కేరళలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. దేశంలో సర్‌ ఇప్పటికే ప్రధాన సమస్యగా ఉంది. మన దేశం రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకోవడాన్ని కట్టడి చేయడానికి ట్రంప్‌ ఎవరు?’ అని రాజా ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తోందని సీపీఐ సీనియర్‌ నేత కె.రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు వేసిన పలు ప్రశ్నలకు రాజా సమాధానం చెప్పారు.


ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్దాం

‘ప్రజల్లోకి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలి. దాని ద్వారా అన్ని స్థాయిల్లో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణాన్ని బలోపేతం చేయాలి’ అని డి.రాజా పిలుపునిచ్చారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ శక్తులు భారత రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. సమాఖ్యవాదం దేశ పాలనలో అత్యంత ప్రాథమిక సూత్రం. మోదీ ప్రభుత్వం దాన్ని బలహీనపరుస్తోంది. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ ఆగడాలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీ చురుకుగా వ్యవహరించాలి’ అని రాజా అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలపైన, బిహార్‌లో ఇండియా బ్లాక్‌ ఓటమిపైన, రాబోయే రోజుల్లో పార్టీ కర్తవ్యం, సీపీఐ 100 సంవత్సరాల విజయోత్సవాలపై రాజా ప్రసంగించారు. సమావేశంలో జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 04:34 AM