CPI Demands: పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:04 AM
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై...
అన్నదాతలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: రామకృష్ణ
ఆస్పరి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అధ్యక్షతన బుధవారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ... ‘నష్టపోయిన ఉల్లి పంటలకు హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో అధికంగా పండించే పత్తి, టమో టా, ఉల్లి, మిర్చి పంటలకు, అలాగే ఇతర జిల్లాల్లో ఎక్కువగా పండించే మామిడి, సపోట, అరటి, దానిమ్మ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. వేదవతి, గుండ్రేవుల, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి’ అని రామకృష్ణ కోరారు.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి: ఈశ్వరయ్య
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల వేతనాలను పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బుధవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గుజరాత్ తరహాలో అంగన్‌వాడీలకు నెలకు రూ.24,800, హెల్పర్లకు రూ.20,300 చొప్పున చెల్లించాలని కోరారు. తమ న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం వారంతా 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారని ఈశ్వరయ్య తెలిపారు.