CPI Narayana: టీటీడీ భూముల్లో స్టార్ హోటల్ ఎలా నిర్మిస్తారు
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:17 AM
అలిపిరి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని ఒబెరాయ్ స్టార్ హోటల్‌కు కేటాయించడం సరికాదు.
ఒబెరాయ్ కేటాయింపులను రద్దు చేయండి: నారాయణ
తిరుపతి(ఆటోనగర్), డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘అలిపిరి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని ఒబెరాయ్ స్టార్ హోటల్‌కు కేటాయించడం సరికాదు. కేటాయింపును వెంటనే రద్దు చేయాలి’ అని సీపీఐ జాతీయ కంట్రోల్ మిషన్ చైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. హోటల్‌కు కేటాయించిన భూ ములను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ... ‘టీటీడీ భూముల్లో స్టార్ హోటల్ ఎలా నిర్మిస్తారు? ఆ స్టార్ హోటల్‌లో పబ్బులు, బార్లు, మాంసం ఉంటాయి. వీటిని దేవుడు ఎలా ఒప్పుకొంటాడు. అలిపిరి వద్ద పవిత్రమైన ప్రదేశంలో ప్రైవేటు స్టార్ హోటల్‌కు అప్పనంగా భూములు కేటాయించడం అపచారం కాదా? ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వలేక టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించినట్లు చూపించి, అనంతరం ఒబెరాయ్ హోటల్‌కు 25 ఎకరాలు కేటాయించింది. ఢిల్లీ కార్పొరేట్ కంపెనీల పెద్దలు, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి ఈ భూ కేటాయింపులో జోక్యం చేసుకొని ఉంటారు. తిరుపతి గురించి బాగా తెలిసిన సీఎం చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే ఈ స్థలాన్ని ఎలా అప్పగిస్తారు? గతంలో వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయగా, ఉద్యోగులు, ప్రజలు అడ్డుకోవడంతో ఆగింది’ అని నారాయణ అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు, నేతలు పి.మురళి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.