Ginning Mills: నిబంధనల సడలింపునకు సీసీఐ అంగీకారం
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:39 AM
రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిబంధనలను సడలించేందుకు సీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించింది.
పత్తి కొనుగోలు కేంద్రాలకు త్వరలో నోటిఫికేషన్
జిన్నింగ్ మిల్లుల యజమానులతో ఢిల్లీలో సమావేశం
సీసీ కెమెరాల ఏర్పాటు, రైతు మ్యాపింగ్‌పై చర్చ
కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్
గుంటూరు సిటీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిబంధనలను సడలించేందుకు సీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించింది. దేశంలో ఉన్న జిన్నింగ్ మిల్లుల యజమానులు, సీసీఐ అధికారులతో టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పద్మిని సింగ్లా గురువారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా పాల్గొన్న ఈ సమావేశంలో లింట్ (దూది) నాణ్యతపై విధించిన పరిమితులను సడలించేందుకు పూర్తిస్థాయి అంగీకారం కుదిరింది. జిన్నింగ్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టే నిబంధనలు కూడా పూర్తిగా పక్కన పెడతామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, రైతుల మ్యాపింగ్, ఎల్ 1, ఎల్ 2 కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని ప్రకటించినట్టు సమాచారం. సవరించిన నిబంధనలతో మరో నాలుగు రోజుల్లో కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ టీఎంసీ కన్సార్టియం ప్రతినిధులు మన్నవ హరినాథ్‌బాబు, ఎల్‌సీటీసీ శంకర్ పాల్గొన్నారు.