Political Deals: రాజంపేటలో కోవర్టుల రాజ్యం
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:15 AM
మనం పెంచుకున్న కోడి రోజూ మన ఇంట్లో తింటూ.. గుడ్డు మాత్రం పొరుగింట్లో పెడితే ఎలా ఉంటుంది? అచ్చం ఇలాంటి పరిస్థితే రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది.
లోక్‌సభ స్థానం పరిధిలో ‘ఫిక్సింగ్’ రాజకీయం
కొందరు తమ్ముళ్లు మోసేది పసుపు జెండా.. పెద్దిరెడ్డి ప్రయోజనాలే రహస్య అజెండా
2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి
ఆ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం
నాడు పెద్దిరెడ్డి ఎన్నో అరాచకాలు, అక్రమాలు
2023లో చంద్రబాబుపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి
అక్రమార్కులకు కొందరు టీడీపీ నేతల సహకారం
వైసీపీ పాలనలో అన్నమయ్య జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం, వాళ్ల అనుచరులు చేసిన అక్రమాలకు అంతే లేదు. జిల్లాలో కొందరు టీడీపీ నేతలు తప్ప ముఖ్య నాయకులు ఎవరూ వీటి గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయ ప్రత్యర్థిగా చూడకపోగా.. ‘మాకు మీరు.. మీకు మేము’ అన్నట్టుగా సర్దుబాటులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
(రాయచోటి-ఆంధ్రజ్యోతి)
మనం పెంచుకున్న కోడి రోజూ మన ఇంట్లో తింటూ.. గుడ్డు మాత్రం పొరుగింట్లో పెడితే ఎలా ఉంటుంది? అచ్చం ఇలాంటి పరిస్థితే రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్రస్థాయి పదవుల్లో ఉన్న నాయకులు, నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు, పదవులు ఉన్న కొందరు నాయకులు వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల మనోభావాలతో సంబంధం లేకుండా వైసీపీ నాయకులతో ఆర్థిక, వ్యాపార సంబంధాలు నెరుపుతున్నారు. రహస్యంగా సంబంధాలు కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి 52 రోజులు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో టీడీపీ చావో రేవో అనే రీతిలో పోరాడింది. అయితే గత ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో కొందరు జిల్లా, రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేయగా.. మరికొందరు పట్టుబట్టి సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి గట్టిగా కృషి చేశారు. అయినా వీళ్లే ప్రస్తుత ప్రభుత్వంలో కీలక స్థానాలలో ఉన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఎప్పుడూ నోరెత్తరు. పైకి మోసేది పసుపు జెండా, లోలోపల పెద్దిరెడ్డి కుటుంబ ప్రయోజనాలే రహస్య అజెండాగా పనిచేస్తున్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు. అధిష్ఠానం ఇప్పటికైనా మేలుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి కష్టాలు తప్పవని అంటున్నారు.
పెద్దిరెడ్డి అక్రమాలపై నోరే మెదపరు
వైసీపీ పాలనలో అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం, వాళ్ల అనుచరులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. పేదల భూములు ఆక్రమించారు. ఇతరుల పేరుతో ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న క్వారీలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుకను రేయింబవళ్లూ బెంగళూరుకు తరలించి వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఫ్రీహోల్డ్ పేరుతో వందల ఎకరాలను అక్రమంగా రెగ్యులర్ చేయించుకున్నారు. తవ్వేకొద్దీ ఈ అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ పాపాలు బయట పడకూడదనే మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయానికే ఆయన మనుషులు నిప్పుపెట్టి కీలక డాక్యుమెంట్లను కాల్చివేశారనే ఆరోపణలున్నాయి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణ చేయిస్తోంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలలో దాదాపు కంకర క్వారీలు వీళ్ల కనుసన్నల్లోనే నడిచాయి. ఇసుక, కంకర అక్రమంగా తరలించేందుకు పీఎల్‌ఆర్ పేరుతో వందలాది టిప్పర్లు జిల్లాలో రాత్రిపగలూ తిరిగాయి. వాటి మీద కనీసం ఒక కేసు కూడా నమోదైన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం రాగానే వాటి జాడే లేదు. ఒకటి, రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు తప్ప మిగిలిన ముఖ్య నాయకులు ఎవరూ వీటి గురించి మాట్లాడరు. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయరు. పోలీసులకు ఫిర్యాదులు చేయరు. పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎవరూ పెద్దిరెడ్డి అక్రమాల గురించి మాట్లాడే సాహసం చేయరు. ఎప్పుడైనా అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినపుడు మాత్రమే మాట్లాడతారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తరు.
అంతా కోవర్ట్ రాజకీయమే
తంబళ్లపల్లె నియోజకవర్గంలో గతంలో టీడీపీ చాలా బలంగా ఉండేది. టీడీపీ నాయకులు రాజకీయంగా ఒకప్పటి కాంగ్రెస్ పార్టీతో గట్టిగా పోరాడేవాళ్లు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథరెడ్డి గెలవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డబ్బు మాత్రమే పనిచేయడం మొదలు పెట్టిం ది. దీంతో టీడీపీలోని ముఖ్య నాయకులు సైతం ఆ ఐదేళ్లూ వైసీపీకి వ్యతిరేకంగా గొంతు విప్పలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి 2019 నుంచి 2024 వరకు తంబళ్లపల్లె నియోజకవర్గంలో తాలిబాన్ తరహా పాల న జరిగింది. అనేక అక్రమాలు జరిగాయి. భూమ ులు ఆక్రమించారు. అక్రమ కేసులు పెట్టి హింసించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడు లు సైతం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే రూ.700 కోట్లతో ముదివేడు వద్ద పెద్దిరెడ్డి కుటుంబం ఒక రిజర్వాయర్‌నే నిర్మించింది. భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండానే ఈ పనులు జరిగాయి. 2023లో తంబళ్లపల్లె నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లదాడికి తెగించారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన సుమారు 750 మంది టీడీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. వందల ఎకరాలను వైసీపీలో అతి ముఖ్యనాయకులు ఆక్రమించారు. అయిన ా వీటి గురించి తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులు ఎవరూ ఇప్పుడు నోరు మెదపడం లేదు. లోలోపల వైసీపీ ముఖ్య నాయకులతో లాలూచీ పడడంతోనే ఎవరూ బాధితుల పక్షాన నిలబడలేదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఒక్కసారి కూడా టీడీపీ జెండా మోయని దాసరిపల్లె జయచంద్రారెడ్డికి 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చారు. ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి అని, వైసీపీ కోవర్ట్ అని అప్పట్లో నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ మొ త్తం వ్యతిరేకించినా వినలేదు. పార్టీ టికెట్ తెచ్చుకున్న ఆయన ఎన్నికల్లో తన గెలుపు కోసం పూర్తి స్థాయిలో కష్టపడలేదన్న ప్రధాన ఆరోపణ ఉంది. కొన్ని మండలాల్లో కనీసం ఒకరోజు కూడా ప్రచారం చేయలేదనే ఆ రోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వా త గత వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన వా రిపై కఠిన చర్యలు తప్పవని అందరూ ఊహించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతు న్నా.. అక్రమార్కులపై కనీసం ఈగ కూడా వాలలేదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. కీలక స్థానాలలో ఉన్న కొందరు నాయకులు వారికి సహకరిస్తున్నారని, అంతేగాక వర్గాల పేరుతో టీడీపీకి ఓటు వేసిన వారిపైనే కేసులు బనాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వైసీపీ అభ్యర్థికి ‘తమ్ముళ్ల’ సాయం
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి. టీడీపీలో చాలా ఏళ్లుగా ఉంటూ చంద్రబాబు, లోకేశ్ వెంట తిరిగే నాయకులు.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి ఆర్థిక సాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.6 కోట్లు వడ్డీకి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ డబ్బుకు గ్యారెంటీగా వైసీపీ అఽభ్యర్థి కుటుంబసభ్యుల పేరిట రాజంపేట మండ లం బ్రాహ్మణపల్లెలో సర్వే నంబరు-111కు పైన.. 120 లోపు ఉన్న భూముల్లో 17 ఎకరాలకు పైగా టీడీపీ నాయకుడు తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. ఇదంతా 2024 ఏప్రిల్ నుంచి జూలైలోపు జరిగింది. వైసీపీ అభ్యర్థికి డబ్బు సర్దుబాటు చేసిన నాయకుడు.. పార్టీకి రాష్ట్రంలో చేసిన సేవ చాలదని, అమెరికాలోనూ ఇదేవిధంగా చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయనే గాక టీడీపీలో జిల్లా స్థాయి పదవులో ఉన్న ఓ నాయకుడు టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యంఓటమికి గట్టిగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థికి లోపాయికారీగా సహకరించి, టీడీపీ అభ్యర్థికి ఎన్నికల సమయంలో డబ్బు సర్దుబాటు కాకుండా చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. అంతేగాక ఆయనకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా పార్టీ ఓటమికి కారకులైన వాళ్లపై చర్యలు తీసుకోకపోగా పదవులు, బాధ్యతలు కట్టబెట్టారు.