Posani Court Clash: ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను అగౌరపర్చారు
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:00 AM
పోసానిపై కేసులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సూళ్లూరుపేట సీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది

మీ చర్య కోర్టుధిక్కరణ కిందకి వస్తుంది
సూళ్లూరుపేట సీఐకి నోటీసులు
పోసానిపై కేసులో తదుపరిచర్యలు నిలుపుదల
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): సినీనటుడు పోసాని కృష్ణమురళి విషయంలో బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని తాము ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 111(వ్యవస్థీకృతనేరం), ఇతర సెక్షన్లు చేర్చి విచారణకు పిలవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అగౌరవపర్చడమేనని వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తు చేస్తున్న సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్ సీఐ చర్యలు కోర్టుధిక్కరణ కిందికి వస్తాయని పేర్కొంది. దర్యాప్తు అధికారి చర్యలు కోర్టు అధికారాన్ని, రూల్ ఆఫ్ లాను అధిగమించడమేనని తెలిపింది. బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చినప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, తమ ఉత్తర్వులను పక్కనపెట్టి దర్యాప్తు అధికారి దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని పేర్కొంది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి సీఐ మురళీకృష్ణకు ఫామ్-1 నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుని పోసాని అసభ్యపదజాలంతో దూషించారన్న ఫిర్యాదు ఆధారంగా గతేడాది నవంబర్ 14న సూళ్లూరుపేట పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ గతంలో పోసాని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విషయంలో బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని మార్చి 6న సూళ్లూరుపేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 15న తమ ముందు హాజరుకావాలని దర్యాప్తు అధికారి ఇటీవల పోసానికి నోటీసులు జారీ చేశారు. దీంతో కేసును కొట్టివేయాలంటూ పోసాని తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది పాపుడిప్పు శశిధర్ వాదనలు వినిపించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. దర్యాప్తు అధికారి తీరును తీవ్రంగా తప్పుపట్టారు.