Judge Eka Pavan Kumar: తెలుగులోనే కోర్టు తీర్పులు
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:26 AM
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి న్యాయస్థానంలో ప్రధాన పౌర న్యాయాధికారి(ప్రిన్సిపల్ సివిల్ జడ్జి) ఏకా పవన్‌కుమార్ ఐదు వ్యాజ్యాలపై తెలుగులో తీర్పు వెలువరించి...
తెనాలి న్యాయాధికారి భాషాభిమానం
తెనాలి క్రైం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి న్యాయస్థానంలో ప్రధాన పౌర న్యాయాధికారి(ప్రిన్సిపల్ సివిల్ జడ్జి) ఏకా పవన్‌కుమార్ ఐదు వ్యాజ్యాలపై తెలుగులో తీర్పు వెలువరించి భాషాభిమానాన్ని చాటుకున్నారు. ఇందులో నాలుగు పౌర దావాల వాగ్దాన పత్రాలు (ప్రాంసరీనోట్లు)దాఖలు చేసినవి కాగా, మరొకటి ఒక ముద్దాయి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నమోదయిన వ్యాజ్యం. సాధారణంగా బ్రిటీష్ కాలం నుంచీ కోర్టుల్లో న్యాయమూర్తులు ఇంగ్లీషు భాషలోనే తీర్పును వెలువరించడం రివాజు. వీటిని న్యాయవాదులు తిరిగి తెలుగులో కక్షిదారులకు వివరిస్తే తప్ప, వారికి అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడి న్యాయాధికారి ఏకా పవన్‌కుమార్ మొదటి నుంచీ గృహహింస, అటవీశాఖ, వ్యక్తిగత చీటీలు, సహకార చట్టాల పరిధిలో జరుగుతున్న మోసాలు, హక్కుల గుర్తింపు, తగాదాలు, దొమ్మీలు తదితర కేసులకు సంబంధించి తెలుగులోనే కక్షిదారులకు అర్ధమయ్యేలా తీర్పులు ఇస్తూ గుర్తింపు పొందారు.