Share News

Atrocities court : వంశీ బ్యారక్‌ మార్చలేం

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:42 AM

సింగిల్‌ బ్యారక్‌ నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్‌లోకి మార్చాలని, లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్‌లో అనుమతించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని

 Atrocities court : వంశీ బ్యారక్‌ మార్చలేం

  • భద్రతా కోణంలోనే ప్రత్యేక బ్యారక్‌ ఇచ్చాం

  • కోర్టుకు వివరించిన జైలు అధికారులు

విజయవాడ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): భద్రతా కారణాల రీత్యా విజయవాడ జిల్లా జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ బ్యారక్‌ మార్పు చేయడం వీలుపడదని జైలు అధికారులు కోర్టుకు వివరించారు. తనను సింగిల్‌ బ్యారక్‌ నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్‌లోకి మార్చాలని, లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్‌లో అనుమతించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. జైలు సూపరింటెండెంట్‌ పాల్‌ హంస, ఇన్నర్‌ జైలర్‌ గణేష్‌ కోర్టుకు హాజరై న్యాయాధికారి హిమబిందుకు జైలులో మొత్తం పరిస్థితిని వివరించారు. వంశీ మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీ నాయకుడిగా ఉన్నారని, భద్రతా కారణాల రీత్యా ఆయన్ను సింగిల్‌ బ్యారక్‌లో పెట్టామని తెలిపారు. జైలులో గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌ కేసుల ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకోసమే ఆయనను ప్రత్యేకంగా బ్యారక్‌లో ఉంచామన్నారు. వంశీని బ్యారక్‌ మార్పు చేస్తే ఏదైనా జరగరానిది జరిగితే జైలు అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ వాదనతో న్యాయాధికారి హిమబిందు ఏకీభవించి బ్యారక్‌ మార్పు సాధ్యంకాదని స్పష్టం చేశారు.


అనంతరం వంశీ తరఫు న్యాయవాది సత్యశ్రీ స్పందిస్తూ.. ఆయనకు మెత్తటి దుప్పటి, దిండు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి జైలు అధికారులు అంగీకరించారు. కాగా, ముదునూరి సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ ఇప్పించాలని వల్లభనేని వంశీ దాఖలు చేసి పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం కావాలని సత్యవర్థన్‌ తరఫు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కోర్టును కోరడంతో ఆ విచారణ వాయిదా వేశారు. కాగా, వంశీని విచారించడానికి మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయాధికారి హిమబిందు ఆ తీర్పు వెలువరించారు.


  • వంశీ కేసులో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి

  • విజయవాడ పటమట పోలీసులకు హైకోర్టు ఆదేశం

వైసీపీ నేత వల్లభనేని వంశీపై నమోదైన కేసు విషయంలో గతనెల 10నుంచి15వ తేదీ వరకు స్టేషన్‌ లోపల, ఆవరణలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని విజయవాడ పటమట పోలీసులను సోమవారం హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. తన భర్త అరెస్ట్‌ అక్రమమని నిరూపించేందుకు ఆధారమైన విజయవాడ పటమట పోలీస్‌ స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వంశీ సతీమణి పంకజశ్రీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్రదేవ్‌ వాదనలు వినిపించారు.

Updated Date - Mar 11 , 2025 | 06:42 AM