Share News

ఇద్దరు బిడ్డలతో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:45 AM

రోడ్డు పక్కన ఇరిగేషన్‌ పోరంబోకు స్థలంలో ఏడాదిగా బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన దంపతులు ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పామర్రు మండలం జుజ్జవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

 ఇద్దరు బిడ్డలతో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం

- పరిస్థితి విషమం.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు

- సమీప పొలం యజమాని బంధువు, కౌలు రైతు వేధింపులే కారణమని ఆరోపణ

- కంటతడిపెట్టిస్తున్న చిన్నారుల వీడియో సందేశం

పామర్రు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన ఇరిగేషన్‌ పోరంబోకు స్థలంలో ఏడాదిగా బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన దంపతులు ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పామర్రు మండలం జుజ్జవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. బడ్డీకొట్టు తొలగించాలంటూ సమీప పొలం యజమాని బంధువు, సాగు చేస్తున్న కౌలు రైతు తిరుపతిరావు వేధింపులే దీనికి కారణమని బాధిత కుటుంబం పెట్టిన వీడియో ద్వారా స్పష్టమవుతోందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... లారీ డ్రైవర్‌ అయిన పేరం దుర్గాప్రసాద్‌ (36), లక్ష్మీ తిరుపతమ్మ (34) దంపతులకు నాగవల్లి(13), హర్షిత(9) సంతానం. దుర్గాప్రసాద్‌కు రోడ్డు ప్రమాదంలో కాళ్లు దెబ్బతినడంతో హిందూ శ్మశాన వాటిక సమీపంలో రహదారి పక్కన ఇరిగేషన్‌ పోరంబోకు స్థలంలో బడ్డీకొట్టు పెట్టుకుని హోటల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాల్వకు మరోవైపు గల మెట్ట పొలం కౌలు రైతు తిరుపతిరావు.. విజయవాడలో నివాసం ఉండే ఆ పొలం యజమాని బంధువుతో కలసి బడ్డీకొట్టు తొలగించాలంటూ దుర్గాప్రసాద్‌ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారు. వారి వేధింపులను భరించలేక బిడ్డలతో కలిసి మంగళవారం ఉదయం పచ్చగడ్డి నివారణకు వినియోగించే గైసిల్‌ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బడ్డీకొట్టు వెనుకభాగంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని టిఫిన్‌ కోసం వచ్చిన గ్రామంలోని రైతులు గమనించి 108లో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపారు.

పెద్దమ్మ, పెద్దనాన్నలకు ఏడుస్తూ సెల్ఫీ వీడియో

ఆత్మహత్యాయత్నానికి ముందు దుర్గాప్రసాద్‌ కుమార్తెలు నాగవల్లి, హర్షిత కన్నీటిపర్యంతమవుతూ సెల్ఫీ వీడియో తీసుకుని పెద్దమ్మ, పెద్దనాన్నలకు పంపించారు. అందులో ‘‘తమ్ముడు తేజ.. బాగా చదువుకుని పెద్దవాడివై.. పెదనాన్న, పెద్దమ్మలతోపాటు అక్కను బాగా చూసుకో.. తాము ఇక్కడ గ్రామంలో వేధింపులు భరించలేక మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నాం.. ఏమీ అనుకోకండి.. సారీ.. ప్లీజ్‌రా తమ్ముడు.. తాము చనిపోయిన తర్వాత అందరికి ఒకే చోట దహన సంస్కారాలు చేయండి’’ అంటూ ఏడుస్తూ పెట్టిన వీడియో అందర్ని కంటతడి పెట్టించింది. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పామర్రు ఎస్సై రాజేంద్రప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:45 AM