Cotton Purchase: వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి!
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:47 AM
రాష్ట్రంలో వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది...
గడువు విధించిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు సీసీఐ ఎండీ, మిల్లర్లతో మరోసారి మంత్రి తుమ్మల భేటీ
హైదరాబాద్/వరంగల్ వ్యవసాయం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. భారత పత్తి సంస్థ(సీసీఐ) అధికారులు, జిన్నింగ్ మిల్లర్లు ఏకాభిప్రాయానికి వచ్చి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఆదేశించారు. అయితే, జాబ్ వర్క్ టెండర్లలో పాల్గొనకుండా మొండికేస్తున్న జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సోమవారం మరోసారి సచివాలయంలో సీసీఐ ఎండీ, జిన్నింగ్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సీసీఐ తీసుకొచ్చిన కొన్ని నిబంధనల్లో ఒకటి, రెండు నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. జిన్నింగ్ మిల్లర్లు మాత్రం మొండిపట్టు వీడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిల్లర్ల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే వారంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాల్సిందేనని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
21 నుంచి కొనుగోళ్లు: వరంగల్ సీసీఐ
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని సీసీఐ వరంగల్ శాఖ ప్రకటించింది. తమ పరిధిలో త్వరలో 122 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొనుగోలు కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఇప్పటికే స్లాట్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. పత్తి రైతులందరూ ప్రభుత్వ పోర్టల్‌లో తమ రిజిస్ట్రేషన్‌ను నిర్ధారించుకోవాలని సీసీఐ సూచించింది.