Share News

21 నుంచి పత్తి కొనుగోలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:00 AM

దళారులను నమ్మి మోసపోవద్దని, ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు తెలిపారు.

    21 నుంచి పత్తి కొనుగోలు

దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దు

మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు

కర్నూలు అగ్రికల్చర్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): దళారులను నమ్మి మోసపోవద్దని, ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు తెలిపారు. సోమవారం నగరంలోని మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేడీ మాట్లాడుతూ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్వింటం పత్తికి రూ.7,521 మద్దతు ధరను ప్రకటిస్తే.. ఈసారి క్వింటానికి రూ.8,110 ప్రకటించిందని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 దాకా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో రైతులను ప్రలోభాలకు గురి చేసి వ్యాపారులు, దళారులు తక్కువ ధరకు, తక్కువ తూకంతో కొన్నా, మార్కెట్‌ కమిటీల పరిధిలో అధికారులు, సిబ్బంది అనుమతి లేకుండా రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి తీసుకువచ్చే సమయానికి ముందే గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో తమ పంట వివరాలను నమోదు చేయించాలని సూచించారు. వ్యాపారులు, దళారులు సెస్సు ఆదాయానికి గండి కొట్టి అక్రమ మార్గాల్లో పంట ఉత్పత్తులను బయటి ప్రాంతాలకు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లావణ్య, జిల్లా ఏడీఎం నారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:00 AM