Cotton Corporation of India: 21 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:14 AM
రాష్ట్రంలో ఈనెల 21 వ తేదీ నుంచి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు ప్రారంభించనుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు.
30 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు
గుంటూరు సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈనెల 21 వ తేదీ నుంచి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు ప్రారంభించనుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు. పత్తి కొనుగోలు కోసం గతంలో మాదిరిగానే జిన్నింగ్ మిల్లులను సీసీఐ ఎంపిక చేయనుంది. జి న్నింగ్ మిల్లుల ఎంపికకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఈనెల 10నే ముగిసింది. అయితే బిడ్డింగ్‌లో పాల్గొన్న జిన్నింగ్ మిల్లులను సీసీఐ బృందం తనిఖీ చేసి, అక్కడ ఉన్న వసతులపై సంతృప్తి చెందిన తర్వాత ఎంపిక ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఒకటి, రెం డు రోజుల్లో సీసీఐ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనేది అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఈ ఏడాది రైతుల నుంచి పత్తి కొనుగోలు చేేసందుకు రెండు యాప్‌లను సీసీఐ వినియోగించనుంది. సీసీఐ దేశవ్యాప్తంగా అందుబాటులో తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను రైతులు స్లాట్ బుక్ చేసుకునేందుకు వాడుకోవాలని సీసీఐ అధికారులు చెబుతున్నారు. అమ్మకం ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం అభివృద్థి చేసిన సీఎం యాప్‌ను వినియోగించుకోవచ్చునని చెబుతున్నారు.
దూది బేల్ కు రూ. 1440
ఈ సీజన్‌లో జిన్నింగ్ మిల్లులకు సీసీఐ చెల్లించే (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ధరలను సోమవారం రాత్రి ఖరారు చేశారు. దూది బేల్‌కు రూ. 1440 చెల్లించేందుకు సీసీఐ సుముఖత వ్యక్తం చేయగా జిన్నింగ్ మిల్లుల యజమానులు అంగీకరించారు. వాస్తవానికి మన రాష్ట్రంలో సీసీఐ ఇస్తామన్న ధరలు గిట్టుబాటు కానప్పటికీ పత్తి రైతుల కోసం అంగీకారం తెలిపినట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.