Share News

Cotton Price: పత్తి క్వింటా రూ.8,110

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:07 AM

రాష్ట్రంలో 2025-26 సీజన్‌లో గుర్తించిన మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలుకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది.

Cotton Price: పత్తి క్వింటా రూ.8,110

  • వచ్చే నెల నుంచి సీసీఐ ద్వారా కొనుగోళ్లు

  • మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2025-26 సీజన్‌లో గుర్తించిన మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలుకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఏడాది 4.02 లక్షల హెక్టార్లలో పత్తి పండించగా, 7.12 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సీఎం యాప్‌ ద్వారా కనీస మద్దతు ధరకు వచ్చే నెల నుంచి పత్తి కొనుగోలును సీసీఐ ప్రారంభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. పొడవు పింజ పత్తి క్వింటా రూ.8,110, మధ్యస్త పింజ పత్తి క్వింటా రూ.7,710 చొప్పున కొననున్నట్టు పేర్కొంది. సీసీఐ కొత్త నిబంధనల మేరకు ఎంపిక చేసిన మార్కెట్‌ యార్డులతో పాటు నోటిఫైడ్‌ జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి సేకరణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆధార్‌ ఆధారిత ఈ-పంట డేటా ప్రకారం పత్తి రైతులను గ్రామ వ్యవసాయ సహాయకులు గుర్తించి, రైతు సేవా కేంద్రంలో నమోదు చేయనున్నారు. కాపాస్‌ కిసాన్‌ యాప్‌తో డేటా అనుసంధానం చేసి, స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేయనున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. స్లాట్‌ బుకింగ్‌ నేపథ్యంలో మండలాల వారీగా పంట దిగుబడి, కోత సమయాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. యార్డులు, మిల్లుల్లో పత్తి నిల్వలకు బీమా ఉండాలని నిర్దేశించింది. ప్లాస్టిక్‌, గన్నీ బ్యాగులను నివారించేందుకు రైతులు లూజు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించింది. పత్తి రైతుల కుటుంబ సభ్యులను గుర్తించేందుకు రేషన్‌కార్డులోని డేటాను సీఎంయా్‌పకు అనుసంధానం చేయాలని పౌర సరఫరాలశాఖను ఆదేశించింది. రైతుల ఆధార్‌ లింక్డ్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు సీసీఐ నగదు చెల్లింపులు జరపాలని నిర్దేశించింది. పత్తి అమ్మకం కోసం వివరాల నమోదు సమయంలో ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం ఫొటో కాపీలను రైతులు తీసుకు రావాలని స్పష్టం చేసింది. సాగు విస్తీర్ణం, దిగుబడి, పత్తితీతల మేరకు మండలాల వారీగా అమ్మకానికి రైతులను అనుమతించనున్నారు.


పత్తి నాణ్యతాప్రమాణాలను రైతులకు వివరించాలని, అగ్ని నిరోధక, తేమ శాతం గుర్తింపు పరికరాలు, టార్పాలిన్లు, ఎలక్ర్టానిక్‌ తూనికలు, సీసీ కెమేరాలు మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది. జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీ కెమేరాల ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సీసీఐకి సూచించింది. పత్తి రవాణా వివరాలూ యాప్‌లో నమోదు చేసి, రవాణాదారులకు చెల్లింపులు జరపాలని పేర్కొంది. జిల్లా స్థాయిలో పత్తి కొనుగోలు కార్యకలాపాల పర్యవేక్షణకు జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Sep 26 , 2025 | 05:08 AM