Guntur: సీసీఐకి జిన్నర్ల షాక్
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:07 AM
సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి జిన్నింగ్ మిల్లుల యజమానులు గట్టి షాక్ ఇచ్చారు. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి సీసీఐ విడుదల చేసిన బిడ్డింగ్ టెండర్ ప్రక్రియను రాష్ట్రంలోని జిన్నర్లు బహిష్కరించారు.
గడువు ముగుస్తున్నా బిడ్లు వేయకుండా నిరసన
టెండర్ నిబంధనలు సడలించాలని పట్టు
సీసీ కెమెరాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చిన వైనం
ఈ సీజన్‌లో దూది శాతం పెంచాలన్న నూతన నిబంధనపైనా మిల్లర్ల ఆగ్రహం
టెండర్ ప్రక్రియను నిలిపివేసి చర్చించండి
సీసీఐ చైర్మన్‌కు అసోసియేషన్ లేఖ
గుంటూరు సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి జిన్నింగ్ మిల్లుల యజమానులు గట్టి షాక్ ఇచ్చారు. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి సీసీఐ విడుదల చేసిన బిడ్డింగ్ టెండర్ ప్రక్రియను రాష్ట్రంలోని జిన్నర్లు బహిష్కరించారు. నిబంధనలు సడలించే వరకు ఒక్క టెండర్ కూడా దాఖలు చేయబోమని భీష్మించారు. ఆంధ్రలో పత్తి సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు వీలుగా సీసీఐ ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ కొనుగోలు కేంద్రాలను మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేయడం వల్ల లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆ నేపథ్యంలో పత్తి మిల్లుల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించిన సీసీఐ.. జిన్నింగ్ మిల్లుల ఎంపిక కోసం ఆగస్టు 12న టెండర్ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 1న టెండర్లు దాఖలు చేసేందుకు చివరి రోజుగా పేర్కొంది. అయితే ఆగస్టు 31 వ తేదీ వచ్చినా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క టెండర్ కూడా పడలేదు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపు మేరకే సీసీఐ టెండర్ ప్రక్రియను బహిష్కరించామని పత్తి మిల్లుల యజమానులు చెబుతున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనను వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సదరు కెమెరాల ఏర్పాటుకు ఒక్కొక్క కేంద్రానికీ రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాపారులు తాజాగా స్టే కూడా తీసుకొచ్చారు.
అలాగే ఈ సీజన్‌లో దూది శాతం (లింట్) పెంచాలన్న నూతన నిబంధనపైనా జిన్నర్లు భగ్గుమంటున్నారు. విత్తనాల రకం, నేల స్వభావం, తెగుళ్ల ఒత్తిడి వంటివి దూది దిగుబడిపై ప్రభావం చూపుతాయని.. ఆంధ్రప్రదేశ్‌లో దూది దిగుబడి పెంచే కొత్త వంగడాలను ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని.. ప్రస్తుతం ఉన్న రకాల వల్ల కేవలం 30-35 శాతం వరకు మాత్రమే దిగుబడి వస్తోందని చెబుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి ఒకసారి మిల్లులోకి వచ్చిన తర్వాత జరిగే ప్రతి దానికీ మిల్లర్‌దే బాధ్యత అన్నట్లుగా సీసీఐ నిబంధనలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. రైతులు పత్తిని వారికి నచ్చిన కేంద్రంలో అమ్ముకునే అవకాశం లేకుండా హద్దులు విధించడంపై కూడా నిరసన వ్యక్తమవుతోంది. ఎల్-1, ఎల్-2, ఎల్-3 అంటూ కేంద్రాలను విభజించడంతో చిన్న మిల్లర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న భావన వారిలో ఉంది. ఇటువంటి అభ్యంతరాలు ఉన్నందున టెండర్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి చర్చలు జరపాలని పత్తి మిల్లర్ల అసోసియేషన్ నేతలు సీసీఐ చైర్మన్‌కు లేఖ రాశారు.