Cotton Farmers: కొనుగోళ్లకు విపత్తి!
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:17 AM
కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకం నిలిపివేయటంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తుండటంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తి కొనుగోళ్లకు ముందుకు రావటం లేదు...
దిగుమతి సుంకం నిలిపివేత ఎఫెక్ట్!.. దేశీయ పత్తి కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం
ముందుకురాని వస్త్ర వ్యాపారులు, సీసీఐ
తక్కువ ధరకు లభిస్తున్న విదేశీ పత్తి
సీసీఐ నిబంధనలతోకొనుగోళ్లు అంతంతమాత్రం
పత్తి వైపు కన్నెత్తి చూడని సీసీఐ బయ్యర్లు
రైతులకు మద్దతు ధర ప్రశ్నార్థకం
ఎకరాకు 30 వేలకు పైగా నష్టం
విజయవాడ (కంచికచర్ల), నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకం నిలిపివేయటంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తుండటంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తి కొనుగోళ్లకు ముందుకు రావటం లేదు. గతంలో మాదిరిగా పత్తి కొన్నట్లయితే నష్టపోవాల్సి వస్తుందన్న కారణంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) కూడా నిబంధనలు విధించి పెద్దగా కొనుగోలు చేయటం లేదు. దీంతో పత్తి రైతులకు మద్దతు ధర లభించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే 80 వేల ఎకరాలకు పైగా రైతులు పత్తి సాగు చేశారు. ఎకరానికి సగటున రూ.50 వేలు పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాల వల్ల తొలికాపు దెబ్బతిన్నది. చెట్టు అడుగు భాగంలో గాలి తగలక, తేమ ఆరక పక్వానికి వచ్చిన కాయలు బూజు పట్టి నల్లగా మారాయి. చేలు మాత్రం పూత, పిందెలతో కళగానే ఉన్నాయి. పోనీ.. మధ్య, చివరి కాపులు చేతికి అందుతాయని రైతులు ఆశించినా.. ఇటీవలి మొంథా తుఫాన్ నిలువునా ముంచింది. తుఫాన్ దెబ్బకు చేలు మెత్తదనం కోల్పోయి, పత్తిగూళ్లు గిడస బారాయి. అప్పటిదాకా ఉన్న కాపంతా దెబ్బతిన్నది. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో పత్తి తీతలు పూర్తవువుతాయి. అలాంటిది ఈ నెలాఖరునాటికే పత్తి తీతలు ఎక్కువగా పూర్తికానున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు చేలు తొలగించి, రబీ పంటల సాగుకు సిద్ధపడుతున్నారు.
దిగుమతులపై 11 శాతం సుంకం
దేశీయ పత్తి ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో ధరలు బాగా పెరుగుతున్నాయని, వస్త్ర పరిశ్రమ ఖర్చులు కూడా బాగా పెరిగినందున దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేయాలని వస్త్ర పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో 11 శాతం దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 30 వరకు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సుంకం నిలిపివేత ఉత్తర్వులను డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఈ ఉత్తర్వులు వస్త్ర వ్యాపారులకు మేలు చేకూర్చగా, దేశీయ పత్తి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. విదేశాల నుంచి పత్తి తక్కువ ధరకు వస్తుండటంతో వస్త్ర వ్యాపారులు దిగుమతుల వైపు మొగ్గుచూపుతున్నారు తప్పితే దేశీయ పత్తిని కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. సుంకం నిలిపివేత కారణంగానే సీసీఐ కూడా గతంలో మాదిరిగా చురుకుగా కొనటం లేదు. పలు రకాల నిబంధనలతో పెద్దగా పత్తి కొనుగోలు చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రైతుల నుంచి కొన్న పత్తి సీసీఐ జిన్నింగ్ చేసిన తర్వాత మార్కెట్లో అమ్మాల్సిందే. మద్దతు ధరకు రైతుల నుంచి కొన్న పత్తిని మార్కెట్లో ఆ ధరకు అమ్మటం చాలా కష్టం. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న భయంతో సీసీఐ కొనుగోళ్లు బాగా తగ్గించేందుకు పలు నిబంధనలతో ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నాణ్యత లేదంటూ కొనటం లేదు. రాష్ట్ర పాలకులు ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ సీసీఐ ససేమిరా అంటోందే తప్ప.. ముందుకు రావటం లేదు. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న పత్తి వైపు సీసీఐ బయ్యర్లు కన్నెత్తి కూడా చూడటం లేదు.
అగాధంలో రైతులు!
ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు తుఫాన్ విలవిల్లాడుతున్న రైతులు, సుంకం నిలిపివేతతో అగాధంలో కూరుకుపోయారు. వరుసగా దెబ్బ మీద దెబ్బ పడటంతో నిలువునా కుంగిపోయారు. ఎకరానికి సగటున ఐదు క్వింటాళ్లకు మించి పత్తి రావటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.8,110. ఎనిమిది శాతం లోపు తేమ ఉంటేనే సీసీఐ మద్దతు ధర ఇస్తుంది. 12 శాతం మించితే కొనదు. 8 నుంచి 12 శాతం మధ్య ఒక్కొక్క శాతానికి రూ.81.10ల వంతున ధరలో కోత పెడుతుంది. రైతులు ఇందుకు అంగీకరించినప్పటికీ సీసీఐ కొనే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించటం లేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు, దళారులకు క్వింటా రూ.4వేల నుంచి రూ.6వేల లోపు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర లభించినట్లయితే రైతులకు కాస్త ఊరట లభించేది. కానీ ఇప్పుడు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోవాల్సి వస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు.