Guntur: పత్తి రైతుపై తేమ కత్తి
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:55 AM
పత్తి సీజన్ ఆరంభానికి ముందే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) బాంబు పేల్చింది. పత్తిలో తేమ 12 శాతానికి మించితే కొనుగోలు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
12 శాతం దాటితే కొనుగోలు చేసేది లేదన్న సీసీఐ
రూల్స్ కఠినతరం చేస్తూ ఆదేశాలు
నవంబరు, డిసెంబర్లలో రాష్ట్రంలో వరుస తుఫాన్లు
తేమ శాతం తగ్గించడం ఏపీలో అసాధ్యం
(గుంటూరు సిటీ - ఆంధ్రజ్యోతి)
పత్తి సీజన్ ఆరంభానికి ముందే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) బాంబు పేల్చింది. పత్తిలో తేమ 12 శాతానికి మించితే కొనుగోలు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఈ నిబంధనను మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని పేర్కొంది. తేమ శాతం 8 నుంచి 12 మధ్య ఉంటేనే కొనుగోలు చేస్తామన్న నిబంధనను ఐదారు సంవత్సరాల క్రితమే సీసీఐ అమలులోకి తెచ్చింది. స్థానిక ప్రభుత్వాల ఒత్తిళ్లతో నిబంధన సడలింపుపై ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకుంటోంది. గత ఏడాది రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తితో నిబంధనను సడలించి పత్తిని కొనుగోలు చేశారు. ఈ సడలింపులతో పక్క రాష్ర్టాల్లో ఇబ్బందులు తలెత్తాయని సీసీఐ అధికారులు అంటున్నారు. దీంతో నిబంధనను తప్పనిసరి చేసినట్లు చెపుతున్నారు. ఇది రాష్ట్ర రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల రీత్యా మిగిలిన రాష్ట్రాలతో ఏపీకి పొంతన ఉండదని రైతులు వివరిస్తున్నారు. పత్తి చేతికి వచ్చే సమయానికి రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. తుఫాన్లు వణికిస్తుంటాయి. ఐదేళ్లు ప్రమాణికంగా తీసుకున్నా అదే విషయం స్పష్టం అవుతుంది. పూర్తిగా తడిచిన పంటను తీసిన తర్వాత ఆరబెట్టటానికి సౌకర్యాలు సరిగా లేకపోవడంతో రైతులు హడావిడిగా అమ్మేస్తూ ఉంటారు. దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు పత్తి ధరను పూర్తిగా తగ్గించి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిలో సీసీఐ ఇచ్చే మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఏడాది క్వింటా పత్తి ధర రూ.8,110 (మొదటి శ్రేణి), దిగువ శ్రేణి నాణ్యత కలిగిన పత్తికి రూ.7,710గా మద్దతు ధర నిర్ణయించారు. రాష్ట్రంలో అక్టోబరు 15 తర్వాత సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ నిబంధన సడలింపునకు ఇప్పటి నుంచే కృషి చేయాలని, లేకపోతే వ్యాపారుల చేతిలోపడి పూర్తిగా మునిగిపోతామని రైతాంగం గగ్గోలు పెడుతోంది.
11న సీసీఐ సీఎండీతో సమావేశం?
సీసీఐ నిబంధనలు కఠినతరం చేయడంపై జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆగ్రహంగా ఉన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పిలిచిన టెండర్లను దేశవ్యాప్తంగా బహిష్కరించారు. రాష్ట్రంలోనూ ఇందుకు భిన్నంగా లేదు. ఈ పరిణామంతో ఖంగుతిన్న సీసీఐ జిన్నింగ్ యజమానుల సంఘాలతో ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని రాష్ర్టాల అసోసియేషన్లు పాల్గొనే ఈ కీలక సమావేశంలో సీసీఐ సీఎండీ పాల్గొంటారని సమాచారం.