పత్తి రైతు కుదేలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:13 AM
పత్తి రైతులకు ఈ ఏడాది అప్పులే మిగిలాయి. పంట చేతికందే సమయంలో తుఫాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు.
పంటలను దున్నేస్తున్న రైతులు
పత్తి పంటను పశువులకు గ్రాసంగా వదిలేస్తున్న వైనం
మరో పంట కోసం సన్నద్ధం
మంత్రాలయం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు ఈ ఏడాది అప్పులే మిగిలాయి. పంట చేతికందే సమయంలో తుఫాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండేళ్ల క్రితం తీవ్ర కరువుతో అల్లాడిన రైతులు ఈ ఏడాది అతివృష్ఠి కారణంగా కుదేలయ్యారు. అధిక వర్షం కారణంగా పంటలో నీరు చేరడంతో పత్తి పంటంతా ఎర్రగా మారింది. గులాబీ రంగు పురుగుసోకి పత్తి మొగ్గ, పూత, పిందె, కాయ రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్ని మందులు వాడినా అదుపు కాకపోవడంతో మూగ జీవాలకు పత్తి పంటను గ్రాసానికి వదిలేశారు. మంత్రాలయం మండలంలోని చెట్నహల్లి గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మయ్య, బోయ నాగేంద్ర, మాధవరం సోరకాయ ఈరన్న తమ పత్తి పంటను పశువులకు మేతగా వదిలేశారు. అదే విధంగా మాధవరం, వగరూరు, సూగూరు, బూదూరు, వి. తిమ్మాపురం, మాలపల్లి, రచ్చమర్రి గ్రామాల్లోని రైతులు వందల ఎకరాల్లోని పంటలను దున్నేశారు. దాదాపు రూ. లక్షలు ఖర్చు పెట్టి పత్తి సాగుచేస్తే పెట్టుబడి సైతం రాలేదని వాపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొంతమంది రైతులు పంటను ీ మూగజీవాలకు మేతగా వదిలేశారు. పత్తికి అధిక రేట్లు ఉన్నాయన్న ఆశతో సాగుచేస్తే చివరికి అప్పులే మూటగట్టుకోవల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పతి పంటను తొలగించి సేద్యం చేసి మిరప, మొక్కజొన్న, వేరుశనగ, కంది, జొన్న సాగు చేయడానికి సిద్ధమయ్యారు.
అధిక వర్షాలతో అప్పులే మిగిలాయి
రెండు ఎకరాల్లో కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగుచేస్తే అప్పులే మిగిలాయి. రెండు ఎకరాలకు దాదాపు రూ. లక్ష ఖర్చు చేస్తే 12 క్వింటాళ్లకు పత్తి దిగుబడికి రూ.80 వేలు పంట వచ్చింది. ఏడాదంతా తాము చేసిన కష్టమంతా వృథా అయింది. పెట్టిన పెట్టుబడైనా వస్తుందని ఆశపడ్డాం. చివరికి అప్పులే మిగిలాయి. మొక్కజొన్న కోసం పంటను మూగజీవాలకు మేతగా వదిలేసి దున్నేశాను.
బోయ నాగేంద్ర, రైతు, చెట్నహళ్ళి గ్రామం
పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఈయేడు ఐదెకరాల్లో పత్తి పంటను సాగుచేస్తే అధికవర్షంతో పంట దెబ్బతిని పెట్టుబడి కూడా రాలేదు. ఎకరాకు రెండు క్వింటాళ్లు పత్తి మాత్రమే వచ్చింది. అది కూలీలకు సరిపోయింది. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకుని న్యాయం చేయాలి.
సొరకాయ ఈరన్న, పత్తి రైతు, మాధవరం గ్రామం