Share News

విద్యాశాఖలో అవినీతి దందా!

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:51 AM

విద్యాశాఖలో అవినీతి దందా తారాస్థాయికి చేరింది. విజయవాడలోని బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాలలో ఐదు టీచర్‌ పోస్టుల భర్తీలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారింది. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి మరీ కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారులు వసూలు చేసినట్టు సమాచారం. ఎంట్రన్స్‌ టెస్టు కూడా అభ్యర్థులకు బదులు వేరే వారితో రాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఓ కీలక అధికారి నడిపించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అవినీతిపై కలెక్టరేట్‌లోని ఉన్నతాధికారుల్లో సైతం తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.

విద్యాశాఖలో అవినీతి దందా!

- ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీలో భారీగా చేతులు మారిన నగదు

- బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాలలో ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

- ఇదే అదనుగా తెరవెనుక చక్రం తిప్పిన కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారులు

- ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు!

- ఎంట్రన్స్‌ టెస్టు కూడా వేరే వ్యక్తులతో రాయించారనే ప్రచారం!

- ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా విద్యాశాఖ వ్యవహారం

విద్యాశాఖలో అవినీతి దందా తారాస్థాయికి చేరింది. విజయవాడలోని బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాలలో ఐదు టీచర్‌ పోస్టుల భర్తీలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారింది. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి మరీ కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారులు వసూలు చేసినట్టు సమాచారం. ఎంట్రన్స్‌ టెస్టు కూడా అభ్యర్థులకు బదులు వేరే వారితో రాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఓ కీలక అధికారి నడిపించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అవినీతిపై కలెక్టరేట్‌లోని ఉన్నతాధికారుల్లో సైతం తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం/విజయవాడ :

విజయవాడలోని బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి ఐదు టీచర్‌ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతులు తెచ్చుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించిన విద్యాశాఖ పరిపాలనా వ్యవహారాలన్నీ కృష్ణాజిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారాలు చూసేది తామేనని, తమ కనుసన్నల్లోనే ఈ పోస్టుల భర్తీ జరగాలని కీలక అధికారి తనదైన శైలిలో ఆల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్‌జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించవద్దని, ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో పాఠశాల యాజమాన్యం కృష్ణా డీఈవో కార్యాలయ అధికారులు చెప్పినట్లుగా నడచుకుంటామని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ కీలక అధికారి తన చేతికి మట్టి అంటకుండా ఈ టీచర్‌ పోస్టుల భర్తీలో మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపేలా ఒక డీవైఈవోకు బాధ్యతలు అప్పగించి తెరవెనుక కథ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి.

అభ్యర్థులతో నామమాత్రంగా పరీక్ష రాయించి..

అజరయ్య ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో ఐదు టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ, పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక గుట్టుచప్పుడు కాకుండా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్‌ పోస్టు కావాలంటే ఇంత మొత్తంలో నగదు చెల్లించాలని తెర వెనుక బేరం పెట్టి, ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలను వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. యాజమాన్యానికి ఇంత, విద్యాశాఖ అధికారులకు ఇంత అని విడమరచి చెప్పి మరీ నగదు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యం సంగతి పక్కనపెట్టి ఒక్కో టీచర్‌ పోస్టుకు కనీసంగా రూ.10 లక్షలకు తగ్గకుండా నగదు సమర్పిస్తేనే అనుమతులు ఇస్తామని విద్యాశాఖ అధికారులు ఖరాఖండిగా చెప్పి వసూళ్లకు పాల్పడ్డారని డీఈవో కార్యాలయ అధికారులే చెప్పుకుంటున్నారు. టీచర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహణలోనూ నిబంధనలను తుంగలోతొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. టీచర్‌ పోస్టులు దక్కించుకునేందుకు నగదు చెల్లించిన వారి పేరున హాల్‌ టికెట్లు ఇచ్చారు. పరీక్ష జరిగే సమయానికి గంట ముందే ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పరీక్ష రాయించినట్లు విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పరీక్ష జరిగిన తర్వాత పేపర్‌లను అసలైన అభ్యర్థులు రాసినట్లుగా తారుమారు చేశారని, ఇది బహిరంగ రహస్యమేనని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఎపిసోడ్‌ మొత్తం విద్యాశాఖ కీలక అధికారి సూచనలతోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీలో విద్యాశాఖ అధికారులు ఇంతగా బరితెగించడంతో ఈ విషయం ఆనోటా, ఈనోటా బయటకు వచ్చింది. మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఇద్దరు, ముగ్గురు అధికారులు కలిస్తే టీచర్‌ పోస్టుల భర్తీలో విద్యాశాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై చర్చించుకుంటూ కనిపించడం గమనార్హం. తొలుత మూడు పోస్టులను భర్తీ చేసి, కొద్ది రోజుల తర్వాత మరో రెండు పోస్టులను భర్తీ చేశారని విద్యాశాఖ అధికారులు చెప్పుకుంటున్నారు.

అంతా తానై నడిపిన కీలక అధికారి!

కృష్ణాజిల్లా విద్యాశాఖలో పనిచేసే కీలక అధికారి తీరు ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతోంది. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి తనదైన శైలిలో వ్యవహారాలు నడుపుతున్న సదరు అధికారి తన అనుభవాన్నంతటినీ ఉపయోగించి టీచర్‌ పోస్టుల భర్తీలో పెద్ద మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడ్డారనే అంశంపై జిల్లాస్థాయి అధికారులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇంత జరిగినా ఈ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే అంశంపైనా చర్చ జరుగుతోంది.

Updated Date - Oct 10 , 2025 | 12:51 AM