‘డ్రెయినేజీ’లో అవినీతి జలగలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:44 AM
గుడివాడ డ్రెయినేజీ శాఖ ఈఈ కార్యాలయం అవినీతి కంపుకోడుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడకు వచ్చిన ఇద్దరు అధికారులు జలగలుగా మారి కాంట్రాక్టర్లను పీల్చివేస్తున్నారు. ఏ పని అవ్వాలన్నా చేయి తడపాల్సిందే.. లేదంటే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. బిల్లుల మంజూరు వ్యవహారంలో ఒకశాతం కమీషన్‌ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీ అనుకూల కాంట్రాక్టర్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
- గుడివాడ డ్రెయినేజీ శాఖ ఈఈ కార్యాలయంలో లంచావతారులు!
- వైసీపీ హయాంలో వచ్చి పాతుకుపోయిన ఇద్దరు అధికారులు
- ఏ పని అవ్వాలన్నా చేయి తడపాల్సిందే.. లేదంటే పెండింగ్‌లోనే ఫైల్స్
- బిల్లులో ఒక శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి!
- అంతా ఒక ఉన్నతాధికారి కనుసన్నల్లోనే వ్యవహారాలు!
గుడివాడ డ్రెయినేజీ శాఖ ఈఈ కార్యాలయం అవినీతి కంపుకోడుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడకు వచ్చిన ఇద్దరు అధికారులు జలగలుగా మారి కాంట్రాక్టర్లను పీల్చివేస్తున్నారు. ఏ పని అవ్వాలన్నా చేయి తడపాల్సిందే.. లేదంటే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. బిల్లుల మంజూరు వ్యవహారంలో ఒకశాతం కమీషన్‌ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీ అనుకూల కాంట్రాక్టర్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-గుడివాడ:
గుడివాడ పట్టణంలో డ్రెయినేజీశాఖ ఈఈ కార్యాలయం ఉంది. దీని గురించి ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లకు తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. ఇక్కడ పనిచేస్తున్న అధికారుల రూటే సప‘రేటు’. ఏ పని చేయాలన్నా చెయ్యి తడపాల్సిందే. లేదంటే వీరి ప్రతాపాన్ని చూపుతారు. గత వైసీపీ హయాంలో ఇద్దరు ఉద్యోగులు బదిలీపై ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే మాటగా వీరిద్దరూ చెలరేగిపోతున్నారు. కొత్త ఎం.బుక్‌కు నెంబరింగ్ వేయాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. పని తాలుకు బిల్లులకు మాత్రం ఖచ్చితంగా ఒక శాతం వీరికి చెల్లించాల్సిందే. ఇవ్వకుంటే కాంట్రాక్టర్‌లకు చుక్కలు చూపిస్తారని సమాచారం. లంచంగా వచ్చిన మొత్తంలో ఇద్దరు చెరి సగం పంచుకుంటారని తెలిసింది. వీరి అవినీతి ఎంతలా అంటే ఏకంగా పెనమలూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ చొక్కా విప్పి ధర్నాకు దిగుతానని ఉన్నతాధికారులకే సమాచారం అందిస్తే ఎం.బుక్‌కు నెంబరింగ్ యిచ్చారు. నందివాడ మండలానికి చెందిన మరో టీడీపీ అనుకూల కాంట్రాక్టర్ బిల్లులను అప్లోడ్ చేసుకోవడానికి ఎం.బుక్ కోసం సంప్రదించగా, బుక్ కనిపించడం లేదని ఆ ఇద్దరు చెప్పారని, ఈ విషయం ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఎం.బుక్ బయటపడింది. అప్పటికప్పుడే ఎం.బుక్‌ను పూర్తి చేసి ఇచ్చారని కార్యాలయవర్గాల సమాచారం. ఇటీవల గుడివాడ డ్రెయినేజీ ఓ అండ్ ఎం వర్క్స్ ఎల్.వో.సీ.కి సంబంధించి రూ.8.59 కోట్ల బిల్లుల్లో గత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌లకు పెద్ద పీట వేస్తూ, వారి బిల్లులను అప్లోడ్ చేశారు. అదే సమయంలో టీడీపీ అనుకూల సీఎన్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు చెందిన సుమారు రూ.45 లక్షల బిల్లులను అప్లోడ్ చేయకుండా ఇబ్బందులు పెట్టినట్టు సమాచారం.
అందినకాడికి దోపిడీ!
డ్రెయినేజీ శాఖలో కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు అదనపు ఖర్చు తప్పదు. ముఖ్యంగా ఎం.బుక్‌లను కాంట్రాక్టర్ కొనుగోలు చేసుకోవాలి. దానికి నెంబరింగ్ వేయాలన్న సదరు అధికారి చేతులు తడపాలి. చేసిన పనిని ఎం.బుక్‌లో రికార్డు చేయాలంటే ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తారు. సదరు వ్యక్తికి పనిని బట్టి రూ.5వేల నుంచి రూ.20వేల వరకు కాంట్రాక్టర్ చెల్లించాలి. బిల్లులను అప్లోడ్ చేయాలంటే ఎం.బుక్ కావాల్సిందే. దీనికి సదరు ఉద్యోగికి ఒక శాతం రొక్కం చెల్లించాలి. బిల్లు చెల్లింపు అయిన తర్వాత తమ డిపాజిట్‌లను వెనక్కి తీసుకోవాలంటే కూడా ఎం.బుక్ అవసరముంటుంది. మళ్లీ చెయ్యి తడిపితేనే ఎం.బుక్ కాంట్రాక్టర్ చేతికి వస్తుంది. ఈ విఽధంగా డ్రెయినేజీ శాఖలో అందిన కాడికి దోచుకుంటున్నారు.
ఏసీబీ దాడిలో ఉలికిపాటు
ఏసీబీ అధికారుల దాడితో డ్రెయినేజీశాఖ ఈఈ కార్యాలయం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. చల్లపల్లి ప్రాంతంలో రూ.36 లక్షలతో డ్రెయినేజీ పనులను రేపల్లెకు చెందిన తురకా రాజా చేశారు. కోర్టు ఆదేశాలతో బిల్లు చెల్లింపు జరుగగా, తాను చేసిన డిపాజిట్ తాలుకు నగదును తీసుకునేందుకు ఎం.బుక్ అవసరముండటంతో డ్రెయినేజీ శాఖ జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావును సంప్రదించారు. ఒక శాతం నగదు చెల్లిస్తే అవసరమైన ఎం.బుక్ ఇస్తానంటూ బేరం పెట్టారు. విసిగిపోయిన కాంట్రాక్టర్ రాజా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. సోమవారం లంచం తీసుకుంటున్న శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరో ఉద్యోగి తృటిలో తప్పించుకున్నాడని సమాచారం. అవినీతి వ్యవహారంలో వీరిద్దరికి ఒక ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు కార్యాలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. లంచంగా వచ్చిన నగదులో సదరు ఉన్నతాధికారికి కూడా వాటలున్నట్లు వినికిడి.