అవినీతి ‘వెలుగు’!
ABN , Publish Date - Sep 22 , 2025 | 01:08 AM
మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయం వివాదాలమయంగా తయారైంది. ఆడిట్ పేరుతో గ్రామైక్య సంఘాల నుంచి భారీగా నగదు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారాలు కొనసాగించేందుకు నెలల తరబడి ఏపీఎం పోస్టును భర్తీ చేయకుండా వదిలేశార విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా తానై వ్యవహరిస్తున్న ఓ సీసీకి ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టేందుకు డీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నించగా, ఉన్నతాధికారులు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గారని సమాచారం. ఇక్కడకు మరెవరూ రాకుండా చక్రం తిప్పుతున్నారని తెలిసింది.
- వివాదాలమయంగా మచిలీపట్నం వెలుగు కార్యాలయం
- ఆడిట్ పేరుతో గ్రామైక్య సంఘాల నుంచి నగదు వసూలు
- నకిలీ డ్వాక్రా సంఘాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు
- గత జనవరి నుంచి భర్తీకి నోచుకోని ఏపీఎం పోస్టు
- అంతాతానై వ్యవహరిస్తున్న సీసీపై పలు ఆరోపణలు
మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయం వివాదాలమయంగా తయారైంది. ఆడిట్ పేరుతో గ్రామైక్య సంఘాల నుంచి భారీగా నగదు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారాలు కొనసాగించేందుకు నెలల తరబడి ఏపీఎం పోస్టును భర్తీ చేయకుండా వదిలేశార విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా తానై వ్యవహరిస్తున్న ఓ సీసీకి ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టేందుకు డీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నించగా, ఉన్నతాధికారులు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గారని సమాచారం. ఇక్కడకు మరెవరూ రాకుండా చక్రం తిప్పుతున్నారని తెలిసింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం మండలంలో 76 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1700లకుపైగా డ్వాక్రా సంఘాలున్నాయి. ఏపీఎం కార్యాలయంలో ఐదుగురు సీసీలు పనిచేయాల్సి ఉండగా, ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం) పోస్టు కూడా నెలల తరబడి ఖళీగా ఉంది. పదిహేను రోజుల క్రితం మచిలీపట్నం మండలంలోని గ్రామైక్య సంఘాలకు సంబంధించి ఆడిట్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఆడిట్‌లో తొలిరోజు మధ్యాహ్నం ఒంటి గంటలోపు 20 గ్రామైక్య సంఘాలక సంబంధించిన ఆడిట్‌ను ముగ్గురు అధికారులు పూర్తి చేశారు. తెరవెనుక ఏం జరిగిందో గానీ రెండోరోజు నాటికి 76 గ్రామైక్య సంఘాల ఆడిట్‌ను హడావిడిగా అధికారులతో పూర్తి చేయించారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో డీఆర్‌డీఏ అధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వేరే మండలంలో పనిచేస్తున్నట్లుగా చూపుతున్న ఒక సీసీ (కమ్యూనిటీ కోఆర్డినేటర్) ఆడిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పి రూ.వెయ్యి నుంచి రూ.1600 చొప్పున నగదు వసూలు చేసినట్లు సమాచారం. ఆడిట్ త్వరితగతిన పూర్తిచేసి వెళ్లిపోయేలా డీఆర్‌డీఏ కార్యాలయంలోని ఒక అధికారి, సీసీ తెరవెనుక చక్రం తిప్పారని డీఆర్‌డీఏ కార్యాలయ అధికారులే చెప్పుకుంటున్నారు.
నకిలీ డ్వాక్రా సంఘాలకు నగదును మళ్లించేశారా!
మచిలీపట్నం మండలంలో 1700లకుపైగా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 100 వరకు నకిలీ డ్వాక్రా సంఘాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయంలో అన్నీ తానై చక్రం తిప్పే ఒక సీసీ కనుసన్నల్లో ఈ నకిలీ డ్వాక్రా సంఘాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ డ్వాక్రా సంఘాల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తమ బంధువుల ఖాతాలకు ఈ ఏడాది మార్చికి ముందే ఈ సీసీ మళ్లించారని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని మండలంలో పనిచేసే పలువురు సీసీలు చెప్పుకుంటున్నారు. చిట్టిపాలెంలో అధిక మొత్తంలో నకిలీ డ్వాక్రా సంఘాలున్నాయని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని సీసీలు అంటున్నారు.
ఏపీఎంను నియమించకుండా జాప్యం!
మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయంలో ఏపీఎంను నియమించకుండా డీఆర్‌డీఏ అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు విడతల్లో జిల్లాలో ఏపీఎంలకు బదిలీలు జరిగాయి. రెండు విడతల్లోనూ మచిలీపట్నం మండలం వెలుగు కార్యాలయానికి ఏపీఎంను నియమించకుండా పక్కనపెట్టేశారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ మండలంలో పని చేసేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని డీఆర్‌డీఏ అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారని సమాచారం. ఇక్కడ పనిచేసే సీసీ ఒకరు సరైన విద్యార్హతలు లేకున్నా ఏపీఎం పోస్టును తనకు ఇవ్వాలని తెరవెనుక ప్రయత్నాలు చేసింది. అధికారులు ఈ ప్రతిపాదనను సెర్ప్ కార్యాలయానికి రెండు విడతలుగా పంపారు. దీన్ని సెర్ప్ అధికారులు తిరస్కరించి ఈ ఫైల్‌ను వెనక్కి పంపారు. అయినా డీఆర్‌డీఏ అధికారులు ఈ సీసీని ఇన్‌చార్జి ఏపీఎంగా నియమిస్తూ ఇటీవల కాలంలో ఉత్తర్వులు జారీ చేశారు. వివాదాస్పదమైన ఈ సీసీని ఇన్‌చార్జి ఏపీఎం పోస్టులో ఎలా నియమిస్తారంటూ టీడీపీకి చెందిన మండల స్థాయి క్లస్టర్ ఇన్‌చార్జీలు ప్రశ్నించడంతో ఈ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. సదరు సీసీ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండటంతో పాటు, క్లస్టర్ ఇన్‌చార్జీల నుంచి ఒత్తిడి రావడంతో ఆమెను పెడన మండలానికి జూన్‌లో బదిలీ చేశారు. అయినా ఈ సీసీ పెడన మండలానికి వెళ్లకుండా, మచిలీపట్నం మండలంలోనే పనిచేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. తెరవెనుక ఉండి మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయం పరిపాలనా వ్యవహారాల్లో తన హవా కొనసాగిస్తోంది. డీఆర్‌డీఏ అధికారులు చేసిన తప్పిదాలన్నీ తనకు తెలుసని, వీటి ఆఽధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్న ఈ సీసీ, తనను మళ్లీ మచిలీపట్నం మండలంలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని డీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారని డీఆర్‌డీఏ కార్యాలయ సిబ్బంది చెప్పుకుంటున్నారు.