అటవీశాఖలో అవినీతి..!
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:27 PM
రాష్ట్రంలోనే సంచలనంగా మారిన అటవీశాఖ రిటైర్డు ఉద్యోగి చాంద్‌బాషా చేసిన అక్రమాలను పరిశీలిస్తే ఆశాఖలో అవినీతి హెచ్చుమీరినట్లు తెలుస్తోంది.
చాంద్‌బాషా వ్యవహరంలో ఆశ్చర్యపోయేలా అవకతవకలు
వివిధ పథకాల నిధుల వినియోగంలో గోల్‌మాల్
ఇప్పటివరకు రూ.7.5కోట్ల వరకు నిధులు దారి మళ్లింపు?
రేంజ్‌ల పరిధిలోనూ.. అక్రమాల ఊడలు
ఆత్మకూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే సంచలనంగా మారిన అటవీశాఖ రిటైర్డు ఉద్యోగి చాంద్‌బాషా చేసిన అక్రమాలను పరిశీలిస్తే ఆశాఖలో అవినీతి హెచ్చుమీరినట్లు తెలుస్తోంది. ఈ అవకతవకల్లో కింది స్థాయి ఎఫ్‌బీఓల నుంచి ఐఎఫ్‌ఎస్ అధికారుల వరకు అడుగడుగున వారి పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది మే 19న ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు. ఇందులో ఎస్‌ఎనటీఆర్ ఎఫ్‌డీపీటీ బీ.ఏ.కృష్ణమూర్తి, విజిలెన్స డీఎఫ్‌ఓ ఎన.శివకుమార్, నంద్యాల సర్కిల్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, ఆత్మకూరు, నంద్యాల డివిజన్లకు చెందిన అడ్మినిస్ర్టేటీవ్ ఆఫీసర్లు చంద్రశేఖరరాజు, జీఎస్.రవికుమార్, రమేష్‌లను నియమించారు. అయితే వీరు చేపట్టిన విచారణలో రూ.7.5కోట్ల వరకు అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. అయితే వాటికి సంబంధించి పూర్తిస్థాయిలో ఆధారాలు లభించకుండా చాంద్‌బాషా ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో విచారణ బృందం అధికారులు సైతం తలలు పట్టుకుని తాము పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేమంటూ చేతులెత్తేసినట్టు సమాచారం.
ఆశ్చర్యపోయేలా అవకతవకలు:
ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ కార్యాలయం పరిధిలో అడ్మినిస్ర్టేటీవ్ ఆఫీసర్‌గా పని చేసి గత ఏడాది జూలై నెలలో పదవీవిరమణ పొందిన చాంద్‌బాషా చేసిన అక్రమాల్లో ప్రధానంగా చెక్‌పోస్టుల నుంచి వచ్చిన సొమ్మును ఆంధ్రప్రదేశ టైగర్ కన్జర్వేషన ఫండ్ (ఏపీటీసీఎఫ్), ఫారెస్టు డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ) తదితర సంస్థలకు చెక్కులను ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసినప్పుడు మాత్రమే చేతివాటం ప్రదర్శించి ఆ చెక్కులను దారిమళ్లించినట్లు తొలుత అధికారులు గుర్తించారు. ఈ లెక్కన జూన 21వ తేది వరకు జరిగిన విచారణలో రూ.4.37కోట్ల వరకు నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించారు. ఆతర్వాత కూడా చేపట్టిన విచారణలో చాంద్‌బాషా అటవీశాఖలోని వివిథ పథకాలకు సంబంధించి నిధుల విషయంలో కూడా గోల్‌మాల్ జరిగి మరో రూ.3కోట్లకు పైగా అక్రమాలు వెలుగు చూసినట్లు తెలిసింది. ఇందులో కింది స్థాయి అటవీ సిబ్బంది మొదలుకుని కొందరు రేంజర్లను కూడా భాగస్వాముల్ని చేసి నిధులను దారిమళ్లించినట్లు సమాచారం.
వివిధ పథకాల ద్వారా నిధుల కేటాయింపు
అటవీ శాఖ పరిపాలనలో పలు పథకాలను అమలు చేస్తుంటారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ కాంపన్సేటరీ ఫారెస్టేషన ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (ఏపీసీఏఎంపీఏ) పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తారు. అటవీ భూమి, పర్యావరణ వ్యవస్థ సేవలు నష్టపోయినట్లయితే పరిహారం ద్వారా అటవీకరణను పెంచడం, సహజ పునరుత్పత్తి సహాయంతో అడవుల నాణ్యతను మెరుగుపర్చడం, జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడం, వన్యప్రాణుల అవాసాలను మెరుగుపర్చడం, అటవీ అగ్ని నియంత్రణ, అటవీ రక్షణ, నేల, నీటి సంరక్షణ కోసం ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను మంజూరు చేస్తారు. అలాగే బయో శాప్ పథకం ద్వారా అడవుల్లో తెగుళ్ల నివారణ, వనరుల నిర్వహణ, అడవుల పరిరక్షణకు నిధులను కేటాయిస్తారు. ఇవేకాకుండా వనవిహారీ పథకంలో భాగంగా అటవీ సమీప గ్రామాల ప్రజలతో కలిపి వన సంరక్షణ సమితిల (వీఎస్‌ఎస్) లను ఏర్పాటు చేసి వీటికి నిధులను మంజూరు చేస్తారు. ఒక్క ఆత్మకూరు డివిజనలోనే 48 వీఎస్‌ఎస్ కమిటీలను ఏర్పాటు చేసి వీటి ద్వారానే అడవుల్లో చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు, నీటికుంటలు, పూడిక తీత పనులు, మొక్కలు నాటడం, అడవుల్లో విత్తనాలు చల్లించడం తదితర పనులను చేపడతారు. అయితే ఈ పథకాలకు సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో కూడా చాంద్‌బాషా గోల్‌మాల్ చేసినట్లు తెలిసింది.
నిధుల గోల్‌మాల్ ఇలా..
అడవులు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం ప్రతిఏటా ఆయా పథకాల నిధులను సర్కిళ్లకు కేటాయించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యానికి సంబంధించి ఆ పథకాల నిధులు చేరవేయబడతాయి. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 330 మంది ప్రొటెక్షనవాచర్లు, డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా తదితర ఔట్‌సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరికి జీతాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర అలవెన్సలతో కలిసి ప్రతినెల రూ.50 లక్షల వరకు ఖర్చవుతోంది. అదేక్రమంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఆయా నెలల అవసరాలను బట్టి నిధుల వినియోగం ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ బిల్లులు సకాలంలో అందని కారణంగా ఆయా పథకాల ద్వారా సర్కిల్ ఆఫీసు వారు డివిజన కార్యాలయాలకు అప్పుగా సొమ్మును ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే సర్కిల్ కార్యాలయం నుంచి ఆయా పథకాల (ఏపీసీఏఎంపీఏ, బయో శాప్, వీఎస్‌ఎస్) అమలు కోసం ఖర్చు చేసిన నిధుల తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో కూడా చాంద్‌బాషా గోల్‌మాల్ చేసినట్లు విచారణ బృందం దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సర్కిల్ ఆఫీసు నుంచే వచ్చే సొమ్మును రేంజ్‌లకు చెల్లించడంలోనూ, రీఫండ్‌లోనూ చేతివాటం ప్రదర్శినట్లు సమాచారం. ఆయా పథకాల ద్వారా చేయని పనులకు, నాణ్యత లేని మొక్కుబడి పనులకు కూడా బిల్లులు తయారు చేసి ఇందులో రేంజర్లకు, కింది స్థాయి సిబ్బందికి వాటాలు ఇచ్చి నిధులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఆయా పనులను ఉన్నతాధికారులు పరిశీలించిన దాఖలాలు కూడా లేవని తెలిసింది. అదేక్రమంలో సర్కిల్ ఆఫీసుకు రీఫండ్ చేసే క్రమంలో కూడా చెక్కులను దారిమళ్లించినట్లు సమాచారం. అయితే ఎనఎస్‌టీఆర్ సర్కిల్ ఆఫీసు వారు కూడా నిధుల మంజూరు తర్వాత రీఫండ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాంద్‌బాషా దర్జాగా అక్రమలు సాగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆధారాలను సేకరణలో తలమునకలు
చాంద్‌బాషా చేసిన అక్రమాలను గుర్తించేందుకు విచారణ బృందం సైతం తలమునకలైనట్లు తెలుస్తోంది. అటవీ చెక్‌పోస్టుల అక్రమాలను సులువుగానే గుర్తించినప్పటికీ ఆయా పథకాల అక్రమాల ఆధారాలను పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టతరంగా మారింది. ఇప్పటికే ఆత్మకూరు అటవీ డివిజన వారు బ్యాంకు లావాదేవీలు జరిపే యూనియన బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ నుంచి పలు ఆధారాలను సేకరించారు. మరిన్ని చెక్కులు, నెఫ్ట్‌ఫారాలు, ఇతర పత్రాల కోసం తిరుపతి రీజనల్ ఆఫీసు వారిని సంప్రదించినట్లు తెలిసింది. దీంతో అధికారులకు ఈ సమస్య మరింత జఠిలమైంది. అయితే చాంద్‌బాషా అవినీతి అక్రమాలు తవ్వేకొద్ది బయటపడుతుండటంతో ఏమి చేయాలో దిక్కుతోచక విచారణ బృందం తలలు పట్టుకున్నట్లు తెలిసింది. తమ రెగ్యూలర్ ఉద్యోగాలు చేస్తూ.. ఈ విచారణ చేయడం సాధ్యం కావడం లేదని అప్పటివరకు తయారు చేసిన నివేదికలను ఈ నెల 16వ తేదీన పీసీసీఎఫ్ పీవీ.చలపతిరావుకు అందజేశారు.
రికవరీ ఎలా?
చాంద్‌బాషా అక్రమాల వ్యవహారం అటవీశాఖకే పెనుసవాల్‌గా మారింది. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటన్నది కూడా ఆ శాఖ అధికారులకు అంతుచిక్కడం లేదు. పథకాల అమల్లో చాలా మంది అటవీ సిబ్బంది, ఉద్యోగులను ఇందులో భాగస్వాములు కావడం గందరగోళానికి దారితీస్తోంది. అదేక్రమంలో చాంద్‌బాషా స్వాహా చేసి సొమ్మును ఏవిధంగా రికవరీ చేయాలన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుంటే ప్రస్తుతం చాంద్‌బాషా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను ఈ నెల 17 నుంచి 21 వరకు ఆత్మకూరు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలిసింది. ఏదిఏమైనా.. చాంద్‌బాషా వ్యవహారంతో అటవీశాఖకు కనువిప్పు కలిగిందని చెప్పవచ్చు. ఇలాంటి అక్రమాలకు భవిష్యత తావు లేకుండా అటవీశాఖలో పకడ్భందీ చర్యలకు ఆశాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది.