Share News

Revenue Department: సొమ్ములిస్తేనే సర్వే

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:37 AM

రెవెన్యూ శాఖలో పలువురు సర్వేయర్ల అవినీతి తారస్థాయికి చేరింది. కొలతల కోసం వచ్చే రైతుల ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు.

Revenue Department: సొమ్ములిస్తేనే సర్వే

  • పాస్‌ పుస్తకాలకూ పైసలు పిండుతున్నారు

  • డబ్బులు ముట్టజెబితేనే ‘ఎఫ్‌ లైన్‌’ సెటిల్మెంట్‌

  • సర్వేయర్ల చేతివాటంపై ఫిర్యాదుల వెల్లువ

  • రెవెన్యూ ఫిర్యాదుల్లో 34 శాతం భూ సర్వేపెనేౖ

‘‘రైతులు, భూ యజమానుల సమస్యలన్నీ పరిష్కరించాం. సంతృప్తి స్థాయి అద్భుతంగా ఉంది. భూముల సర్వే బాగా జరుగుతోంది.’’

- కలెక్టర్ల సదస్సులో ఇచ్చిన ప్రజంటేషన్‌లో

రెవెన్యూ శాఖ గొప్పలు

‘‘భూముల సర్వేకు రైతుల నుంచి డబ్బులు డిమాండ్‌ చే స్తున్నారని, పాస్‌పుస్తకాలు ఇవ్వడంలోనూ పిండుకుంటున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.’’

- ఆర్టీజీఎస్‌ ప్రజంటేషన్‌లో చేసిన ఆరోపణలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెవెన్యూ శాఖలో పలువురు సర్వేయర్ల అవినీతి తారస్థాయికి చేరింది. కొలతల కోసం వచ్చే రైతుల ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. వీరు క్షేత్రస్థాయిలో అడుగు పెట్టాలంటే అన్నదాతలకు చేతి చమురు వదలాల్సిందే. లేకపోతే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 60 శాతం రెవెన్యూ శాఖపైనే ఉన్నాయి. ఇందులో 34.8 శాతం భూముల సర్వే సంబంధిత ఫిర్యాదులు కాగా, మరో 24.7 శాతం రైతులకు ఉచితంగా ఇవ్వాల్సిన పాస్‌పుస్తకాలకు సంబంధించినవేనని రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఆర్టీజీఎస్‌ తన ప్రజంటేషన్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రెవెన్యూ శాఖ చెబుతున్న ఫీల్‌గుడ్‌ విధానం క్షేత్రస్థాయిలో ఏమాత్రం లేదని, భూ సమస్యలు ఇంకా బలంగానే ఉన్నాయని, అవినీతి పెచ్చరిల్లుతోందని ఆర్టీజీఎస్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


ఇష్టారాజ్యంగా భూముల సర్వే

గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల సర్వేపైఅనేక ఆరోపణలు, విమర్శలున్నాయి. అప్పట్లో రైతులను సంప్రదించకుండానే వారి భూములను సర్వే చేసి ఇష్టానుసారం రికార్డులు రూపొందించారు. తాము అధికారంలోకి రాగానే రైతుల భూ సమస్యలు, ప్రత్యేకించి రీసర్వే ఇబ్బందులను పరిష్కరిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2వ దశ సర్వే జరుగుతోంది. జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన పాస్‌పుస్తకాలు రద్దు చేసి వాటిస్థానంలో ఏపీ రాజముద్ర ఉన్న కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని జిల్లాల్లో మొదలైనా రెవెన్యూ సిబ్బంది డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు.


లక్షల్లో ఎఫ్‌ లైన్‌ పిటిషన్లు

రీసర్వే లేని సమయంలో, భూముల సర్వే కొనసాగుతున్న దశలో కూడా ఎఫ్‌ లైన్‌ పిటిషన్లు లక్షల సంఖ్యలో అందుతున్నాయి. రీసర్వే పూర్తయిన 6వేల గ్రామాల నుంచి కూడా ఈ దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని గ్రామ, మండల సర్వేయర్లు సెటిల్‌ చేయాలి. రైతుల కోరిక మేరకు భూముల హద్దులు, కొలతలు నిర్ధారించాలి. సబ్‌డివిజన్‌ వర్క్‌ చేపట్టాలి. ఇందుకోసం కూడా సర్వేయర్లు డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా ఆర్టీజీఎస్‌ ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంది. సర్వే పనులకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని 34.8 శాతం మంది ఆరోపించారు. వాస్తవానికి ఎఫ్‌ లైన్‌ పిటిషన్‌ సమర్పించే సమయంలోనే రైతులు మీసేవ కేంద్రంలో డబ్బులు చెల్లిస్తారు. పిటిషన్‌ను నమోదు చేసిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధిలో సర్వేయర్‌ వెళ్లి రైతు సమక్షంలో భూమి కొలతలు వేసి, హద్దులు చూపాలి. ఇందుకు సర్వేయర్‌కు రూపాయి ముట్టజెప్పాల్సిన పనిలేదు. కానీ అదనంగా డబ్బులిస్తే తప్ప ఎఫ్‌ లైన్‌ పిటిషన్లు సెటిల్‌ చేయట్లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.


క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నామమాత్రం

రెవెన్యూ, సర్వే విభాగాల్లో క్షేత్రస్థాయి అధికారుల పై పర్యవేక్షణ, నియంత్రణ కొరవడిందన్న విమర్శలున్నాయి. తహసీల్దార్‌ ఆఫీసుల పనితీరుపై జిల్లాస్థాయిలో సమీక్షలు ఉండటం లేదు. ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడమే తప్ప ఇటు కలెక్టర్‌, అటు ఆర్డీవోలు పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. దీంతో సిబ్బంది పనితీరుపై ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులకు తెలియడం లేదు. ఇక సర్వే విభాగం పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారుతోందన్న ఫిర్యాదులున్నాయి. జిల్లాస్థాయిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అధికారి ఉన్నా పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటోంది. గ్రామ, మండల సర్వేయర్లపై శాఖాపరంగా పర్యవేక్ష ణ ఉండటం లేదు. ఈ పనిచేయాల్సిన రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌(ఆర్డీడీ) వ్యవస్థ నీరుగారిపోయింది. రీసర్వే జరిగే సమయంలో వీరు జిల్లాల్లోనే పనిచేయాలి. కానీ గత జగన్‌ ప్రభుత్వంలోనే ఆర్డీడీలను జిల్లాల నుంచి పిలిపించి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారి కి జిల్లాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ, పట్టు ఉండకపోగా సర్వేయర్ల పనితీరుపై పరిశీలన కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల అమలులో అవినీతి చీడ తొలగడం లేదన్న ఆందోళనా సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - Sep 21 , 2025 | 05:39 AM