IT Raids: కందిపప్పులోనూ కుమ్ముడు
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:52 AM
గత వైసీపీ ప్రభుత్వంలో కంది పప్పు ధర పెరగ డం వెనుక ఉన్న కుట్ర ఇప్పుడు బయటపడింది. ఓ ప్రైవేటు వ్యాపారితో ఆ పార్టీ నేతలకు ఉన్న లింకు లు వెలుగు చూశాయి.
గత ప్రభుత్వంలోని లీలలు తాజాగా వెలుగులోకి
నాడు గుంటూరు వ్యాపారి వెంకటేశ్వరరావుకు సహకరించిన వైసీపీ నాయకులు
ధరలు పెంచి క్యాష్ చేసుకున్న వైనం
ఎన్నికల ముందు వైసీపీ నేతలకు ముడుపులు
తాజాగా ఐటీ దాడుల్లో కుట్ర బయటకు
150 బంగారం బిస్కెట్లు, 40 కోట్ల నగదు సీజ్
త్వరలో ఈడీ రంగంలోకి దిగే అవకాశం
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో కంది పప్పు ధర పెరగ డం వెనుక ఉన్న కుట్ర ఇప్పుడు బయటపడింది. ఓ ప్రైవేటు వ్యాపారితో ఆ పార్టీ నేతలకు ఉన్న లింకు లు వెలుగు చూశాయి. గుంటూరు నగరానికి చెందిన కందిపప్పు కమీషన్ వ్యాపారి సకల వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా తన జీరో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ కం దిపప్పు, పచ్చిపప్పు ధర ఎంత ఉండాలో నిర్ణయించే స్థాయికి చేరారు. ఫలితంగా వైసీపీ పాలనలో కేజీ కందిపప్పు ధర ఒకానొక దశలో రూ.200కు చేరింది. విదేశాల నుంచి దిగుమతులు సరిగా లేవని సాకు లు చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా నిలిపేసి రిటైల్ మార్కెట్‌లో ధర పెరగడానికి నాటి వైసీపీ పాలకులు పరోక్షంగా వెంకటేశ్వరరావుకు సహకరించారన్న ఆరోపణలున్నాయి. ప్రతిఫలంగా తెనాలిలోని ఒక దాల్‌మిల్లు యజమాని ద్వా రా వైసీపీ నేతలకు ఎన్నికలకు ముందు పెద్ద మొ త్తంలో నగదు ముట్టజెప్పారు. తాజాగా ఆదాయ పన్ను శాఖ చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ దాడులలో ఇప్పటివరకు వెంకటేశ్వరరావుతో పాటు ఆయనతో సంబంధం ఉన్న వ్యాపారుల నుంచి 150 బంగారం బిస్కెట్లు, రూ.40 కోట్లకు పైగా నగదు, రూ.కోటి చిట్టీలు, రూ.50 లక్షల చిట్టీల జాబితాలను సీజ్ చేసినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో సోదాలు చేస్తే..
గత వైసీపీ పాలనలో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు కూడా వెంకటేశ్వరరావుకే దక్కేలా ఆ పార్టీ నేతలు చూసుకొన్నారు. ఇందుకు భారీగానే ప్రతిఫలం పొందారు. వెంకటేశ్వరరావు మూడు దశాబ్దాలుగా కమీషన్ వ్యాపారంతో పాటు బంగారం, చిట్టీలు, రియల్‌ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేస్తున్న ట్లు అధికారులు గుర్తించారు. ఇన్ని వ్యాపారాలు చే స్తూ ఆదాయ పన్ను చెల్లించకుండా ఇన్నేళ్లూ తప్పించుకొన్నారు. ఐటీ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని ఒక నగల దుకాణంలో సోదాలు నిర్వహించగా గుంటూరు, విశాఖపట్నంలోని వ్యాపారులకు పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లు అమ్మినట్లు తేలింది. దీం తో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి గుం టూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, వినుకొండ, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగి వెంకటేశ్వరరావుతో వ్యాపార లావాదేవీలున్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. మనీ లాండరింగ్‌పైనా అనుమానాలు ఉండటంతో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు!
ఎన్నికలకు ముందు వెంకటేశ్వరరావు సూచనల మేరకు దాల్‌మిల్లు యజమాని నుంచి ఇద్దరు వైసీపీ నేతలు రూ.కోట్ల నగదును అందుకొన్నారు. ఆ యజమాని ఐటీ అధికారులకు ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో నగదు తీసుకున్న వైసీపీ నేతలను కూడా ఐటీ అధికారులు విచారించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ నగదు వాళ్లిద్దరి నుంచి అంతిమంగా ఎక్కడికి చేరిందనేది తెలుస్తుం ది. కాగా గుంటూరు నగరంలో పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకుల లావాదేవీలను చూసే ఆడిటర్ ఒకరు సకల వెంకటేశ్వరరావుతో పాటు ఈ కేసులో ముడిపడి ఉన్న వాళ్లను రక్షించేందుకు రంగంలోకి దిగారు. ‘మీరేం భయపడొద్దు.. అన్ని నేను చూసుకొంటా’ అంటూ అభయం ఇచ్చినట్టు తెలిసింది.
వినుకొండలో ఐటీ సోదాలు
వినుకొండటౌన్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వినుకొండలో నాలుగో రోజు శుక్రవారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శనగల కొనుగోలులో భారీ కుంభకోణానికి సంబంధించి ఐటీ అధికారు లు కందిపప్పు మిల్లులతో పాటు యజమానుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు వినుకొండలో మకాం వేసి తనిఖీలు చేస్తున్నారు. కందిపప్పు మిల్లుల్లోని కంప్యూటర్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. తాజాగా ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఏనుగుపా లెం రోడ్డులోని ఓ మిల్లులో, ఎస్‌బీఐ బజారులోని వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. వినుకొండ పట్టణానికి చెందిన ఓ వ్యాపారిని అధికారు లు విచారణ నిమిత్తం పిలిపించారు. ఆయన వ్యాపార లావాదేవీలు, ఖాతా పుస్తకాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధానంగా నలుగురు వ్యాపారుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.