Share News

Corruption Exposed: గిరి తెగింపు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:04 AM

ప్రభుత్వ ఉత్తర్వులతో ఆయనకు పని లేదు. ఆయన చెప్పిన విధంగా చేస్తే అదే ఒక ఉత్తర్వు. ఆయన డిమాండ్‌ చేసినంత సంచుల్లో సర్దడానికి సిద్ధంగా ఉంటే ఎక్కడైనా సంతకాలు పెట్టేస్తారు.

Corruption Exposed: గిరి తెగింపు

  • ప్రత్యేక వ్యవస్థతో ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్‌ లీలలు

  • ఆమెకు వరలక్ష్మీవ్రత కానుకగా ఆ 25 లక్షలు ఇవ్వాలని..

  • లంచంతో ఏసీబీకి పట్టుబడటంతో కటకటాల పాలు

  • ‘కట్టు’ కథలతో న్యాయాధికారినే బురిడీ కొట్టించే యత్నం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

ప్రభుత్వ ఉత్తర్వులతో ఆయనకు పని లేదు. ఆయన చెప్పిన విధంగా చేస్తే అదే ఒక ఉత్తర్వు. ఆయన డిమాండ్‌ చేసినంత సంచుల్లో సర్దడానికి సిద్ధంగా ఉంటే ఎక్కడైనా సంతకాలు పెట్టేస్తారు. లేకపోతే చుక్కలు చూపిస్తారు. ఇవీ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్‌ లీలలు. ఆయన ఏర్పాటు చేసుకున్న ‘గిరు’ల మధ్య ప్రత్యేక వ్యవస్థను నియమించుకున్నారు. సాధారణంగా ఇంజనీరింగ్‌ పనులు కాంట్రాక్ట్‌కు ఇవ్వాలనుకున్నప్పుడు టెండర్‌ ప్రకియ నిర్వహిస్తారు. దీనికి కొన్ని నిబంధనలుంటాయి. కాంట్రాక్టర్‌కు ఈ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలను చూపించాలి. కూటమి ప్రభుత్వం దీనిని పదేళ ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అన్ని శాఖల్లోనూ అమలయ్యాయి. అయితే, ఈఎన్‌సీ శ్రీనివాస్‌ ఐదేళ్ల అనుభవాన్నే అమలు చేశారు. ఆ విధంగా తన బినామీ కాంట్రాక్టర్లకు ఆయన పనులను కట్టబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


‘కట్టు’ కథలు

ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్‌ కాంట్రాక్టర్‌ కృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండక్‌ చేసి, తొలిదఫాగా రూ.25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఏసీబీకి చిక్కిన తర్వాత కోర్టులో హాజరుపరిచేముందు వరకు ఆయన బాగానే ఉన్నారు. తర్వాత ఆయన చేతికి కట్టు కనిపించింది. కాంట్రాక్టర్‌ కృష్ణంరాజు దాడి చేసి చేయి విరగ్గొట్టారంటూ న్యాయాధికారికి ‘కట్టు’ కథ వినిపించారు. అయితే, దీన్ని న్యాయాధికారి పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, కృష్ణంరాజు నుంచి తీసుకున్న నోట్ల కట్టలను ఈఎన్‌సీ లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు ఛాంబర్‌లోకి వెళ్లారు. వారిని చూడగానే శ్రీనివాస్‌ పారిపోయే ప్రయత్నం చేయగా, ఏసీబీ సిబ్బంది వెంటనే ఛాంబర్‌ తలుపు మూసి శ్రీనివా్‌సను గట్టిగా పట్టుకోవడంతో చేతికి వాపు వచ్చింది. ప్రభుత్వాస్పత్రిలో ఆ చేతికి వైద్యులు కట్టు కట్టగా, ఆ కట్టునే శ్రీనివాస్‌ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ బలంగా కొట్టడం వల్ల చేయి విరిగిందని కోర్టులో చెప్పిన ఆయన జైల్లోను అదే కథ వినిపిస్తున్నారు. ములాఖత్‌లకు వచ్చిన వారికీ ఇదే చెబుతున్నట్టు తెలిసింది. కాగా, కృష్ణంరాజు నుంచి తీసుకున్న రూ.25 లక్షల లంచాన్ని తనకు ప్రత్యేకమైన మహిళకు శ్రావణ శుక్రవారం కానుకగా ఇవ్వాలని శ్రీనివాస్‌ నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏసీబీ అధికారులు పట్టుకోకపోతే ఆ మొత్తం నగదు ‘వరలక్ష్మీవత్ర’ కానుక అయ్యేది.


ఎవరా ‘నాయకుడు’

ఈఎన్‌సీగా ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయాల్సిన శ్రీనివాస్‌ సర్వీసు పొడిగింపు కోసం కొన్ని నెలల నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం ‘సచ్చీలుడి’గా నివేదిక ఇచ్చేలా గిరిజన సంక్షేమ శాఖలో ఒక ‘నాయకుడి’ని ఆయన ఒప్పించారు. శ్రీనివా్‌సపై ఇంతకుముందు ఏసీబీ కేసులు ఉన్నందున గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో జలవనరుల శాఖలో సీఈగా పనిచేస్తున్న ఎస్‌.సుగుణరావును విచారణాధికారిగా నియమించారు. ఆయనే శ్రీనివా్‌సపై అభియోగాలు నిర్ధారణ కాలేదని, సచ్చీలుడని నివేదిక ఇచ్చేశారు. ఆ సుగుణరావు శ్రీనివాస్‌కు బంధువేనని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. విచారణాధికారిగా సుగుణరావు పేరును స్వయంగా శ్రీనివాసే సూచించడం ఇందులో కొసమెరుపు

Updated Date - Aug 12 , 2025 | 06:05 AM