హద్దుమీరిన అవినీతి!
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:45 AM
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో అవినీతి వ్యవహారాలు హద్దుమీరాయి. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని కార్యాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని వేడుకున్నా.. కనికరం చూపకుండా బెదిరింపులకు దిగారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారి సదరు జూనియర్ అసిస్టెంట్‌ను పిలిచి ప్రశ్నించడంతో కార్యాలయ ఏవో చెబితేనే నగదు అడిగానని సమాధానం ఇచ్చిన జూనియర్ అసిస్టెంట్, ఈ వ్యవహారం ఎక్కడ తనకు చుట్టుకుంటుందోనని భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ వ్యవహారం ఆస్పత్రిలో సంచలనంగా మారింది.
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో ఉద్యోగుల తీరుపై విమర్శలు
- శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల నుంచి రూ.10 వేలు చొప్పున డిమాండ్
- నగదు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని బెదిరింపులు
- ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
- జూనియర్ అసిస్టెంట్‌ను పిలిచి మాట్లాడిన ఉన్నతాధికారి
- కార్యాలయ ఏవో నగదు వసూలు చేయమన్నారని వివరణ
- ఆ తర్వాత ఎక్కడ తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందోనని భయపడి ఆత్మహత్యాయత్నం
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో అవినీతి వ్యవహారాలు హద్దుమీరాయి. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని కార్యాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని వేడుకున్నా.. కనికరం చూపకుండా బెదిరింపులకు దిగారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారి సదరు జూనియర్ అసిస్టెంట్‌ను పిలిచి ప్రశ్నించడంతో కార్యాలయ ఏవో చెబితేనే నగదు అడిగానని సమాధానం ఇచ్చిన జూనియర్ అసిస్టెంట్, ఈ వ్యవహారం ఎక్కడ తనకు చుట్టుకుంటుందోనని భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ వ్యవహారం ఆస్పత్రిలో సంచలనంగా మారింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిని అవినీతి జాఢ్యం పట్టిపీడిస్తోంది. మచిలీపట్నం నోబుల్ కళాశాలలో వివిధ వృత్తివిద్యాకోర్సులు చదువుతున్న 20 మంది విద్యార్థినులు ఆస్పత్రిలో పరిపాలనాపరమైన శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే సర్టిఫికెట్‌లు ఇవ్వాలంటే ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున నగదు ఇవ్వాలని ఆస్పత్రి కార్యాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంత నగదు ఇవ్వలేమని విద్యార్థినులు గత కొన్ని రోజులుగా కార్యాలయ సిబ్బందిని ప్రాధేయపడుతున్నారు. తాము అడిగినంత నగదు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కార్యాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. దీంతో విధిలేక విద్యార్థినులు నేరుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆశాలతను గురువారం కలిసి ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ ఆవేదనను ఆమెకు వివరించారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ వెంటనే సంబంధిత విభాగం పరిపాలనా వ్యవహారాలు చూసే జూనియర్ అసిస్టెంట్ పవన్‌ను చాంబరుకు పిలిచి వివరాలు అడిగితెలుసుకున్నారు. కార్యాలయ ఏవో రమణమూర్తి విద్యార్థినుల నుంచి నగదు తీసుకోమని ఒత్తిడి చేస్తేనే తాను అడిగానని జూనియర్ అసిస్టెంట్ చెప్పాడు. ఆ తర్వాత సూపరింటెండెంట్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన పవన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వివిధ రకాల టానిక్‌లను తాగేశాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతన్ని ఆస్పత్రిలోని వార్డులోకి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. శిక్షణ పొందుతున్న విద్యార్థినుల నుంచి కూడా ఆస్పత్రి కార్యాలయ ఉద్యోగులు లంచం అడిగిన అంశం వెలుగులోకి రావడం, ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేయడం ఆస్పత్రివర్గాల్లో చర్చనీయాంశంమైంది.
ఉద్యోగుల తీరుపై అనేక ఫిర్యాదులు
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్ప పొందిన తర్వాత మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తులు చేసుకుంటే ఆస్పత్రి కార్యాలయ ఉద్యోగులు ప్రతి ఫైలుకు ఇంతరేటు నిర్ణయించి మరీ నగదు వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పలువురు పదవీ విరమణ పొంది మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు పెట్టుకున్నవారు ఎంతకీ తమ బిల్లులను చేయకపోవడంతో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కలెక్టర్ బాలాజీ, వైద్యశాఖ రాజమండ్రి ఆర్‌జేడీ, వైద్యశాఖ డైరెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఒక రిటైర్ట్ మహిళా టీచర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొంది, అన్ని ఆధారాలు ఇచ్చి రెండు సార్లుగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బిల్లులు చేసేందుకు ఆస్పత్రి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఒకరు రూ.3వేలు తీసుకున్నారని తెలిపారు. ఆస్పత్రి కార్యాలయ సూపరింటెండెంట్‌కు మరో రూ.3వేలు ఇవ్వలేదనే కారణంతోనే సంబంధిత ఫైలును పక్కనపెట్టేశారని అక్కడి సిబ్బంది చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు నెలలుగా ఈ బిల్లులు చేయలేదని, సంబంధిత రిటైర్డ్ టీచర్ కూడా ఈ నెల 4వ తేదీన మరణించారని, ఆమె ప్రాణాలు ఎవరు తిరిగి తెచ్చిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రిలో మెడికల్ రీయిబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపుల సమయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయాలని ఈ ఫిర్యాదులో పలువురు ఉద్యోగులు కోరారు. కాగా, ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 9వ తేదీన ‘ఆస్పత్రిలో ఆ ఇద్దరు’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై విచారణకు అధికారులు ఆదేశించారు.