Sand Leveling Scam: చేయని చదునుకు సాయం
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:51 AM
గత వైసీపీ హయాంలో కొందరు కాంట్రాక్టర్లు ‘జగనన్న కాలనీల’ చదును వంకతో డబ్బులు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ ఇప్పుడు తిరిగి వారే బిల్లులు చేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వంలో వీరంతా అడ్డగోలుగా జేబులు నింపుకొన్నారు.
కూటమిలోనూ వైసీపీ నేతలదే రాజ్యం
జగనన్న కాలనీల్లో నాడు ఉత్తుత్తి చదును
ఆ పనులపై తనిఖీలకు కూటమి ఆదేశం
అయినా, వారికి బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్‌లోని కొందరు అధికారుల ఉత్సాహం
కోర్టుకు వెళ్లే వైసీపీ నేతలకు పూర్తి సహకారం
తనిఖీల విషయం కావాలనే దాస్తున్న వైనం
దీంతో కోర్టుల్లో నేతలకు అనుకూలంగా తీర్పులు
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జగనన్న కాలనీ కోసం గత ప్రభుత్వం కేటాయించిన స్థలం అప్పుడూ, ఇప్పుడూ నీళ్లలోనే ఉంది. కాంట్రాక్టర్ ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా పోయలేదు. అయినా... చదును పనులు చేసినట్టు అప్పట్లో నమోదు చేయించుకున్నారు. ఆయన మండల వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి అనుచరుడు కావడంతో అప్పట్లో అధికారులు తలొగ్గారు. జరగని ఆ పనులను జరిగినట్లుగా రికార్డు చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే జగనన్న కాలనీల్లో జరిగిన చదును పనులపై తనిఖీలకు ఆదేశించింది. తనిఖీల బృందం ముత్తుకూరుకు ఎప్పుడు వెళ్లి చూసినా అక్కడి కాలనీ స్థలం నీళ్లలోనే ఉంది. అయినా, గత ప్రభుత్వంలో ‘చేసిన’ పనులకు మొత్తం రూ.25 లక్షల మేర బిల్లులు చెల్లించాలని ఆ కాంట్రాక్టరు కోర్టుకు వెళ్లారు. అక్కడ పనులు జరగలేదని కోర్టుకు తెలిపి... బిల్లును తోసిపుచ్చాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. రూ.19 లక్షలు చెల్లించేశారు! అప్పుడంటే వైసీపీ ఒత్తిళ్లతో తప్పులు! మరి ఇప్పుడు ఏమైందని ఈ బిల్లులు?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ హయాంలో కొందరు కాంట్రాక్టర్లు ‘జగనన్న కాలనీల’ చదును వంకతో డబ్బులు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ ఇప్పుడు తిరిగి వారే బిల్లులు చేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వంలో వీరంతా అడ్డగోలుగా జేబులు నింపుకొన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా వారే యమజోరును ప్రదర్శిస్తున్నారు. అధికారుల సహకారంతో కోర్టులో కేసులు వేసి అనుకూల తీర్పులు పొందుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో చదును పనులను ఉపాధి హామీ పథకం నిధులతో సాగించింది. కాంట్రాక్టర్లుగా మారిన వైసీపీ నాయకుల్లో చాలామంది ఈ పనులు దక్కించుకున్నారు. అయితే, ఉపాధిలో అనుమతి లేని పనులుగా వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తేల్చింది. జగన్ సర్కారుకు మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి హౌసింగ్ విభాగానికి ఈ పనులను అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటినుంచి హౌసింగ్‌లో ఇష్టారాజ్యంగా దోపిడీ కొనసాగింది. జగనన్న కాలనీల్లో చదును పనులు చేపట్టకుండానే బిల్లులను వైసీపీ నేతలకు ఇప్పించేందుకు హౌసింగ్‌లోని కొందరు అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఫలితంగా పనుల్లేకుండానే జగనన్న ఇళ్ల కాలనీ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఈ అక్రమాలను నివారించలేని పరిస్థితి ఏర్పడింది.
సాగు.. తున్న తనిఖీలు
గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటి స్థలాల లెవలింగ్‌పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. అసెంబ్లీ జీరో అవర్‌లో లెవలింగ్ అవకతవకలపై చర్చ రావడం, పలు పత్రికల్లో కథనాలు రావడం, రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణ తేజ రంగంలోకి దిగారు. ఆ పనులు తనిఖీ చేసిన తర్వాతే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో ఎక్కడికక్కడ పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ ఈఈలు, ఉపాధి పథకం సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు, అవసరమైన చోట ఇతర శాఖల ఇంజనీర్లతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి సమగ్రమైన విచారణ చేసి సిఫారసులు చేయాలని జిల్లా కలెక్టర్లుకు కృష్ణతేజ సూచించారు. ఆయా జిల్లాల్లో ఆయా పనులకు సంబంధించి 25 శాతం పెండింగ్ చెల్లింపుల పనుల జాబితాను ఆయా డ్వామా పీడీల నుంచి సేకరించాలని, నిబంధనల ప్రకారం పనులు జరిగాయా? లేదా?, గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన సీనరేజ్ చార్జీలు ఆయా పనులు చేసిన వెండర్లు చెల్లించారా లేదా? తదితర నిబంధనలను తనిఖీ సందర్భంగా పాటించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు ఆయా పనులకు సంబంధించి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఇంటి స్థలాల లెవలింగ్ పనుల బిల్లులు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అయితే కమిషనర్ ఆదేశించి 8 నెలలవుతున్నా ఇంకా తనిఖీలు కొన...సాగుతూనే ఉన్నాయి. జిల్లాల్లో కొన్ని చోట్ల గతంలో పనులు నిర్వహించిన సందర్భంలో ఉన్న అధికారులే ఇప్పటికీ ఉన్నారు. దీంతో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ నేతలకు దోచిపెట్టారు..
స్థానిక నేతలకు అప్పనంగా దోచిపెట్టేందుకు ఇంటి స్థలాల లెవలింగ్ పనులను గత ప్రభుత్వం ఎంచుకుంది. ఉపాధి హామీ పథకంలో చేపట్టేందుకు అనుమతి లేకపోయినప్పటికీ.... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ సహకారంతో అడ్డగోలుగా పనులు చేపట్టారు. సుమారు రూ.1125 కోట్ల పనులు చేపట్టి సుమారు రూ.1500 కోట్లకు పైగా బిల్లులను వైసీపీ నేతలు బిల్లులు అప్‌లోడ్ చేశారు. అయితే, ఉపాధిలో ఈ పనులకు అనుమతి లేదని.... చెల్లింపులు చేయరాదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ఎలాగైనా వైసీపీ నేతలకు ఈ బిల్లులు చెల్లించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లులు చెల్లింపుల ప్రక్రియ హౌసింగ్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధిశాఖ వద్ద ఉన్న పనులు బిల్లులను హౌసింగ్‌కు మార్చారు. ఈ క్రమంలో పలు పనులకు సంబంధించి మొత్తం కొలతలను మార్చేసి భారీ స్కాంకు తెరదీశారు. సుమారు రూ.460 కోట్ల ఉపాధి నిధులను సర్దేశారని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది.
రికవరీ చేస్తాం : ప్రభుత్వం
క్వాలిటీ కంట్రోల్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో చాలా చోట్ల రికార్డు చేసిన మేర పనులు లేవని తేలింది. అయినా, అప్పటి వైసీపీ నేతలను బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్‌లోని కొందరు అధికారులు అమిత ఉత్సాహం చూపుతున్నారు. వైసీపీ నేతలకు ఇవ్వాల్సిన మొత్తం బిల్లులు చెల్లిస్తామని ఎంపీడీఓలతో కోర్టులకు స్టేట్‌మెంట్‌లు ఇప్పిస్తున్నారు. ఇప్పటివరకు 23 మంది వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఏలూరు నుంచి ఇద్దరు, నెల్లూరు నుంచి ఐదుగురు, బాపట్ల నుంచి ఆరుగురు, ప్రకాశం నుంచి ఒకరు, పల్నాడు నుంచి ఆరుగురు, ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. కాగా, క్వాలిటీ కంట్రోల్ నివేదికను కోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా కొందరు ఎంపీడీవోలు పూర్తిబిల్లులు చెల్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆ ఎంపీడీవోల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని ఉపాధి హామీ డైరక్టర్ షణ్ముక్‌కుమార్ సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా హెచ్చరించారు.
ఉపాధి సిబ్బందికి ఊరట!
పదోన్నతులపై త్వరలో అన్ని కేడర్లతో భేటీకి నిర్ణయం
ఉపాధి హామీ పథకం సిబ్బంది సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ‘నిర్వేదంలో ఉపాధి సిబ్బంది’ శీర్షికన ఈనెల 30 ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ స్పందించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి ఊరట కలిగించేలా.. వారితో ఈ నెలలోనే సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాల నుంచి ఆయా కేడర్ల ప్రతినిధులను ఈ సమావేశానికి పిలవనున్నారు. ఉపముఖ్యమంత్రి ఓఎ్‌సడీ వెంకటకృష్ణ, కమిషనర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్ ఒక్కోరోజు ఒక్కో కేడర్ సిబ్బందితో సమావేశమై, వారి సమస్యలు తెలుసుకుంటారు. వారికి అందాల్సిన ప్రయోజనాలపై చర్చిస్తారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఎఫ్‌టీఓలుగా చేయడం, ఆయా కేడర్ల గ్రేడ్ ఫిక్సేషన్ పెండింగ్ సమస్యలు, సిబ్బంది జీతాల వ్యత్యాసం, పీఆర్‌సీ ప్రకారం జీతాల పెంచే విషయంపె మాట్లాడనున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన విధంగానే గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బందికి పదోన్నతులు, జీతాలు పెంపు, గ్రాట్యుటీ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.