AP Agros Corruption: ఆగ్రోస్.. అభాసుపాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:18 AM
ఏపీ ఆగ్రోస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ) అవకతవకలకు నిలయమైంది. రైతులకు వ్యవసాయ పరికరాలు, వివిధ ప్రభుత్వ శాఖలకు యంత్ర సామగ్రి, వాహనాలు సరఫరా చేయాల్సిన ఈ సంస్థ అవినీతి అధికారులకు ఆదాయ వనరుగా మారింది.
అవినీతి అధికారులకు ఆదాయ వనరు
కమీషన్ల కోసం ఉద్యోగుల కక్కుర్తి
టెండర్ల ఖరారులో అవకతవకలపై ఆరోపణలు
వైసీపీ నాయకుడికి చెందిన రెండు కంపెనీలకు టెండరు దక్కేలా నిబంధనలు మార్చిన సిబ్బంది
బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఏపీ ఆగ్రోస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ) అవకతవకలకు నిలయమైంది. రైతులకు వ్యవసాయ పరికరాలు, వివిధ ప్రభుత్వ శాఖలకు యంత్ర సామగ్రి, వాహనాలు సరఫరా చేయాల్సిన ఈ సంస్థ అవినీతి అధికారులకు ఆదాయ వనరుగా మారింది. యంత్రపరికరాల సరఫరాకు కమీషన్లు తీసుకుని, అడ్డగోలుగా టెండర్లు ఖరారు చేస్తున్నారని పలువురు ఉద్యోగులపై ఆరోపణలున్నాయి. ఆరేడేళ్లుగా ఆగ్రోస్‌లో అనేక తప్పులు జరిగినా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఆగ్రోస్ చైర్మన్, ఎండీ, ఉద్యోగుల మధ్య గత ప్రభుత్వంలో పెద్ద వివాదం ఏర్పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో అప్పటి ఎండీపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల వాటర్‌షెడ్ పరికరాల టెండర్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని అనంతపురం బదిలీ చేశారు. ఇదే సమయంలో వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులకు, వ్యవసాయ మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని మంత్రి ఓఎస్డీ కోరగా, నిరాకరించినందుకు తనను నెల్లూరు బదిలీ చేయించారని, దీంతో తాను సెలవుపై వెళ్తున్నానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జనరల్ మేనేజర్ రాజమోహన్ ఇటీవల లేఖ రాశారు. తన స్థానంలో నియమించిన అధికారి జీఎంగా అర్హుడు కాదని, ఆతనిపై పెండింగ్ కేసులున్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో ఆగ్రోస్‌లో ఏం జరుగుతోందని ప్రభుత్వం ఆరాతీసింది. మరోవైపు ఈ సంస్థలో అవకతవకలపై ప్రభుత్వానికి కొన్ని నివేదికలు కూడా అందాయి. ఆగ్రోస్‌లో తప్పులకు బాధ్యులు ఎవరనే అంశంపై ఆ సంస్థలో చర్చ జరుగుతోంది.
టెండర్లలో గోల్‌మాల్
రాయలసీమ ప్రాంత రైతులకు రూ.46 కోట్లతో వాటర్‌షెడ్ పరికరాలు సరఫరా చేయాలని గత జనవరిలో పంచాయతీరాజ్ శాఖ భావించింది. దీనికి సంబంధించి ఎంప్యానల్‌మెంట్ కోసం ఆగ్రోస్‌తో ఏప్రిల్‌లో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరికరాల వారీ ధరలతో కొన్ని కంపెనీలు ఎంప్యానల్ అయ్యాయి. రైతులు కోరుకున్న కంపెనీ వద్ద, అవసరమైన పరికరాలు ఎంపిక చేసుకున్న తర్వాత, ఐఎస్ఐ మార్క్ ఉన్న ఒక్కో పరికరాన్ని, ఒక్కో కంపెనీ సరఫరా చేసేలా ఎల్1 టెండర్ పిలవాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి లేఖ వచ్చిందంటూ అకస్మాత్తుగా ఆ టెండర్లు నిలిపివేసింది. అదే సమయంలో పరికరాల తయారీ కంపెనీ ఏపీలోనైనా ఉండాలి లేదా అందులో 15ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధన పెట్టి గతనెల 5న మరోసారి టెండర్ పిలిచారు. దీంతో ఎల్1గా వచ్చిన రెండు కంపెనీలు రిజెక్ట్ అయ్యాయి. అర్హత సాధించిన కంపెనీలకు కొన్ని పరికరాల సరఫరా టెండరు ఖరారైంది. ఎంప్యానల్‌లోని ఏ కంపెనీకి అర్హత లేకుండా పోవడంతో పాటు నాణ్యమైన పరికరాలు సరఫరా చేసే కంపెనీలను కాదని, నాణ్యత లేని పరికరాలను అధిక ధరకు కొనుగోలు చేసేలా టెండర్ నిబంధనలు మార్పు చేయడంలో ఆగ్రోస్ ఉద్యోగులే చక్రం తిప్పారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేపథ్యం ఉన్న నాయకుడికి చెందిన రెండు కంపెనీలకు టెండరు దక్కేలా ప్రక్రియ చేపట్టారు. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడికి సంబంధించిన కంపెనీలకు టెండర్ కట్టబట్టే ప్రయత్నం జరుగుతున్న వ్యవహారంపై ‘లిక్కర్ బాసులకే ఆగ్రోస్ టెండర్లు’ శీర్షికన గతనెలలో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఇదిలా ఉండగా, టెండర్లు ఖరారు కాకముందే ఆగ్రోస్ ఉద్యోగులే కోర్టులో దావా వేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
బోగస్ కంపెనీలకు వర్క్ ఆర్డర్లు
గత డిసెంబరులో 9 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌లకు అవసరమైన రూ.2.45 కోట్ల విలువైన పరికరాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ ఆగ్రోస్‌ను కోరింది. దీనికి టెండర్లు లేకుండా కొటేషన్ పద్ధతిలో హైదరాబాద్‌లోని రెండు సంస్థలకు ఆగ్రోస్ అధికారులు వర్క్‌ఆర్డర్ ఇచ్చారు. సదరు సంస్థల జీఎస్టీ అడ్ర్‌సలు పరిశీలిస్తే.. ఒకటి టైలరింగ్ షాపు, మరోకటి వ్యవసాయ శాఖ అధికారుల సంఘ భవనం అని అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ బోగస్ కంపెనీల వ్యవహారంలో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. పైగా రూ.18 లక్షల విలువైన పరికరాలను రూ.28 లక్షలకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రూ.లక్ష దాటితే టెండరు పిలవాల్సిన ఆగ్రోస్.. ఇలా వర్క్‌ఆర్డర్లు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
‘రైతు రథం’ పథకం కింద 81 మంది రైతులకు ఎల్4508 ఆల్‌రౌండర్ అనే మోడల్ ట్రాక్టర్లను సరఫరా చేయడానికి 2017-18లో ఆగ్రోస్‌తో ఓ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అప్పట్లో రైతుల ఉంచి అధిక ధర వసూలు చేసి, వారికి మరో మోడల్ ట్రాక్టర్లను సరఫరా చేసింది. సదరు కంపెనీతో ఆగ్రోస్ అధికారి ఒకరు లాలూచీ పడి, మోడల్‌ను మార్చి, తక్కువ రేటున్న ట్రాక్టర్లను ఎక్కువ ధరకు సరఫరా చేయించారని 13 నెలల క్రితం రైతులు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టారు. ఒక్కో రైతు రూ.83 వేల వరకూ నష్టపోయినట్లు విచారణలో తేలినా, బాధ్యుడైన అధికారిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.