అవినీతి... అరాచకాలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:04 AM
వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము వ్యవహారశైలిపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భార్య జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నా అన్నీ తానే అన్నట్టు వ్యవహరించి అనేక అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీ కారులను సొంత అవసరాలకు యథేచ్ఛగా వినియోగించడంతో పాటు ఆయిల్ దోపిడీకి పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగులు, పనుల్లో కమీషన్, ఉద్యోగుల బదిలీలు వంటి అనేక విషయాల్లో అవినీతికి పాల్పడినట్టు సమాచారం. మాజీ మంత్రి పేర్ని నాని డైరెక్షన్‌లో శనివారం గుడివాడలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులను బండ బూతులు తిడుతూ దూషించడం చర్చనీయాంశంగా మారింది.
- వైసీపీ నేత ఉప్పాల రాము తీరిది
- ఉమ్మడి కృష్ణా జెడ్పీ అనధికారిక చైర్మన్‌గా అక్రమాలు
- అధికారులు, ఉద్యోగులపై తీవ్ర వేధింపులు
- సొంత అవసరాలకు జెడ్పీ కార్లు యథేచ్ఛగా వినియోగం
- హైదరాబాద్ నుంచి బందరుకు మద్యం తరలింపు!
- గుడివాడలో టీడీపీ శ్రేణులను దూషించడంతో మళ్లీ వార్తల్లోకి..
వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము వ్యవహారశైలిపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భార్య జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నా అన్నీ తానే అన్నట్టు వ్యవహరించి అనేక అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీ కారులను సొంత అవసరాలకు యథేచ్ఛగా వినియోగించడంతో పాటు ఆయిల్ దోపిడీకి పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగులు, పనుల్లో కమీషన్, ఉద్యోగుల బదిలీలు వంటి అనేక విషయాల్లో అవినీతికి పాల్పడినట్టు సమాచారం. మాజీ మంత్రి పేర్ని నాని డైరెక్షన్‌లో శనివారం గుడివాడలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులను బండ బూతులు తిడుతూ దూషించడం చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
వైసీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాము అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. జెడ్పీ చైర్మన్ తానే అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌కు ప్రోటోకాల్ ప్రకారం కారు సదుపాయం ఉంది. దీన్ని అనధికారికంగా ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. కారుకు ఇచ్చిన పరిమితికి మించి ఆయిల్ కొట్టించుకుని సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారని సమాచారం. పెడనలోని ఓ పెట్రోల్ బంకులో ఖాతా ఉందని, ఇక్కడ ఇష్టానుసారం జెడ్పీ కార్లకు ఆయిల్ కొట్టించుకుంటున్నారని తెలిసింది. నెలకు ఇచ్చిన వినియోగ పరిమితి దాటి మరీ ఆయిల్ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌కు తరచూ జెడ్పీ కార్లను వేసుకుని వెళ్లేవారని, జెడ్పీ కారు డ్రైవర్‌ను పక్కన పెట్టి, సొంత డ్రైవర్‌ను తీసుకుని ఒకసారి హైదరాబాద్ వెళ్లారని, ఆ సమయంలో పెద్ద డబ్బాల్లో ఆయిల్ నింపుకుని కారులో తీసుకుని మరీ వెళ్లటం చర్చనీయాంశమైంది. అప్పట్లో జెడ్పీ అధికారులు ఈ వ్యవహారాన్ని గుర్తించారు. వైసీపీ ప్రభుత్వంలో జెడ్పీ చైర్‌పర్సన్ కారులోనే తెలంగాణ నుంచి మద్యం కేసులను తీసుకువచ్చి బందరులోని తన బార్‌కు తరలించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనం కూడా ప్రచురించింది. జెడ్పీ అధికారులు ఉలిక్కిపడి దీనిపై విచారణ కూడా జరిపారు.
పని చేయకపోయినా జీతాలు ఇప్పిస్తూ..
జెడ్పీలో తాత్కాలిక ఉద్యోగులుగా పలువురిని నియమించుకున్నారు. ఈ ఉద్యోగులు ఎప్పుడూ కనపడేవారు కాదని, కానీ వారికి నెలనెలా జీతాలు డ్రా అయ్యేవని ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీ ఉద్యోగుల బదిలీల వ్యవహారాలన్నీ రాము కనుసన్నల్లోనే జరిగేవని సమాచారం. రాము చేస్తున్న అక్రమాలకు సంబంధించిన విషయాలు ఉద్యోగులు పత్రికలకు సమాచారం ఇస్తున్నారన్న అనుమానంతో పలువురిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించినట్టు సమాచారం. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోలను సైతం బండ బూతులు తిడుతూ వారిని భయభ్రాంతులకు గురిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీఈవో, డిప్యూటీ సీఈవోలను వేధించినట్టు సమాచారం.
పనుల్లో కమీషన్లు
అభివృద్ధి పనుల పేరుతో భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. జెడ్పీకి చెందిన ఖరీదైన ఆస్తులను బడా సంస్థలకు కట్టబెట్టి ప్రయోజనాలు పొందాలన్న స్కెచ్ కూడా వేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడలో కాంప్లెక్స్ పేరుతో బందరు రోడ్డు వెంబడి ఉన్న భవనాలను కూలగొట్టారు. జేసీ బంగళా ఉండటంతో.. అప్పట్లో ఈ స్కెచ్‌ను గమనించిన ఎన్టీఆర్ కలెక్టర్ ఢిల్లీరావు దీనికి అడ్డుకట్ట వేశారు. పిన్నమనేని కోటేశ్వరరావు, కడియాల రాఘవరావు వంటి మహానుభావులు పనిచేసి జెడ్పీకి పేరు ప్రఖ్యాతలు తెస్తే, రాము తన సతీమణి ఉప్పాల హారికను అడ్డం పెట్టుకుని తీరని అప్రతిష్టను తీసుకువచ్చారు. అధికారంలో లేకపోయినా సరే తగ్గేది లేదన్నట్టు.. గుడివాడలో టీడీపీ శ్రేణులను దూషించి మరోమారు వివాదంలో చిక్కుకున్నాడు. ఉప్పాల రాముపై కూడా టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జెడ్పీ వేదికగా ఆయన సాగించిన అక్రమాల చిట్టా బయటకు తీయాలని భావిస్తున్నారు.