ఉద్యోగుల్లో ‘అవినీతి’ చెదలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:46 PM
వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతిపరులు రెచ్చిపోయారు. ప్రభుత్వం కార్యాలయాల్లో అయితే ఫైసలివ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితులు ఉండేవి.
ఏసీబీకి జంకని అక్రమార్కులు
ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యమేల్లుతున్న అవినీతి
ఫైసలివ్వనిదే కదలని ఫైళ్లు
బాధితుల నుంచి ముక్కుపిండి వసూళ్లు..
అరకొర దాడులతో అడ్డుకట్టపడేనా?
తాజా దాడులతో ఉద్యోగుల్లో ఆలజడి
కొత్త విధానాలతో రెచ్చిపోతున్న అవినీతిపరులు
వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతిపరులు రెచ్చిపోయారు. ప్రభుత్వం కార్యాలయాల్లో అయితే ఫైసలివ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితులు ఉండేవి. ఏసీబీ అధికారులకు సైతం బెదరని పరిస్థితుల్లో లంచావతారులు ఉన్నారంటే అప్పటి పరిస్థితులు ఎలాగున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఏసీబీ చేపడుతున్న అరకొర దాడులు వారి మార్పు తీసుకురావడం లేదు.ఆయా శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్నారనే విమర్శలున్నాయి. అవినీతిలో మునిగితేలుతున్న అధికారులు చట్టానికి చిక్కకుండా వివిధ రూపా(కొత్తవిధానాల)ల్లో లంచాలు పొందుతున్నారు. ఏసీబీ అధికారులు తమ దృష్టికి వచ్చినా ఫిర్యాదులపైనే స్పందిస్తారనే ప్రచారం ఉంది. బాధితులు వెళ్లి వారిని సంప్రదిస్తేనే వస్తారని.. లేకుంటే ఉదాసీనంగా వ్యవహరించి గాలికి వదిలేస్తారనే అభిప్రాయం లేకపోలేదు.
నంద్యాల, జూన2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా లంచావతారులు ఏసీబీకి కూడా జంకని(బెదరని) పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఎక్కడిక్కడ ఆయా శాఖల్లో కొందరు అధికారులు అందినకాటికి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బాధితులు పలువిధాలుగా నష్టపోతున్నారు. ఏపనికోసం వచ్చినా.. ఫైసలివ్వందే ఫైలు కదలడంలేదు. బాధితుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరికి ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ) దాడులు చేస్తున్నా.. అవినీతి అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆయితే మరీ దారుణం. ఏసీబీ అధికారులు అరకొర దాడులతో మమ అనిపించారు. తద్వారా అవినీతికి మరింత ఆజ్యం పోసినట్లైంది. ఇదే అదునుగా భావించి సదరు అవినీతి అక్రమార్కులు మరింత బరితెగించారు. మొత్తంగా ఏసీబీ అరకొర దాడుల పరిస్థితికి భిన్నంగా మారుతున్నాయి.
ఫ కర్నూలులోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్ బాధితులు బెస్త రఘు, రవి నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. సీఐ మధుసూదనగౌడ్ ఆదేశాలమేరకే లంచం తీసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు వివరించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు సీఐని సైతం అదుపులోకి తీసుకొని విచారించారు.
ఫ మే నెల 16వ తేదిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఏడీఈగా పనిచేస్తున్న రవికాంతచౌదరి తరపున ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్ విద్యుత ట్రాన్సఫార్మర్ కోసం రైతు నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు ఏడీఈతో పాటు ఔసోర్సింగ్ ఉద్యోగిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రవికాంతచౌదరి నుంచి విలువైన పత్రాలు, ఎల్‌ఐసీ బాండ్లు, ఎఫ్‌డీలతో పాటు రూ. 2.85కోట్లు విలువ చేసే 41రకాలు బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు.
ఫ కర్నూలులో మున్సిపల్ సీనియర్ ఇంజనీర్ సురేంద్రబాబు 2022 జూన 31న నగరంలోని క్రిష్ణానగర్ ప్లైఓవర్ కింద ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15లక్షలు లంచం తీసుకుంటూ అప్పటి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ‘అమృత’కి చెందిన ఫైనల్ బిల్లు విషయంలో సదరు అధికారి లంచం తీసుకున్నట్లు తెలిసింది.
ఫ కర్నూలు జిల్లా వెల్దుర్తి పోలీసుస్టేషనలో పనిచేస్తున్న ఏఎస్‌ఐ ఖాదర్‌వలి 2022లో మే22న ఓ కేసులోని నిందితుడిని రిమాండ్‌కు తరలించకుండా ఉండేందుకు సదరు నిందితుడి నుంచి రూ.40వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అప్పటి సీఐ సదరు నగదు తీసుకోమని చెబితే తీసుకున్నట్లు ఆఏఎస్‌ఐ ఏసీబీ అధికారులకు వివరించారు. సదరు సీఐ, ఏఎస్‌ఐపై కేసు నమోదుచేసి ఇద్దరిని సస్పెండ్ చేశారు.
ఫ నంద్యాల మైన్స అండ్ జియాలజీ శాఖలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల నేపథ్యంలో 2023లో సదరు ఉద్యోగి ఇంటిలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రూ.50 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
ఫ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలోని జలకనూరు గ్రామానికి చెందిన వీఆర్వో వెంకట రమణారెడ్డి 2023లో ఓరైతుకు చెందిన భూమిని ఆనలైన చేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేశారు. బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్వోకు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే..
ఫ నంద్యాల జిల్లాలో కొన్నేళ్లుగా నమోదైన కేసులు
-------------------------------------------------------------------------------------------
సంవత్సరం కేసులు
--------------------------------------------------------------------------------------------
2015 12
2016 09
2017 18
2018 18
2019 19
2020 07
2021 12
2022 08
2023 13
2024 03
2025 02(ఇప్పటి వరకు)
--------------------------------------------------------------------------------------------
చట్టానికి చిక్కకుండా వివిధ రూపాల్లో..
ఉమ్మడి కర్నూలు, నంద్యాలలోని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రషన్స, ట్రైజరీ, ఆర్టీఏ, పోలీసు, ఎక్సైజ్, ఇరిగేషన, వైద్యఆరోగ్యశాఖ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమశాఖ, ఐసీడీఎస్, కమర్షియల్ ట్యాక్స్ తదతర ప్రధాన శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందనే ఆరోపణలు కలవు. ఆయా శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్నారనే విమర్శలున్నాయి. అవినీతిలో మునిగితేలుతున్న అధికారులు చట్టానికి చిక్కకుండా వివిధ రూపా(కొత్తవిధానాల)ల్లో లంచాలు పొందుతున్నారు. ఇదే క్రమంలో ఏసీబీ అధికారులు చేసే అరకొర దాడులతో ఆయా సందర్భాలకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ మరీ అవినీతికి బాటలు వేసుకుంటున్నారని సమాచారం.
కనింపిచని మార్పు...
ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా.. ఏశాఖను కదిలించినా.. అవినీతి జోరుగా సాగుతోందనే ప్రచారం జరుగుతుంది. పలుశాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఏసీబీకి పట్టుబడినా అవినీతి అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. చివరకు ఎంతో కొంత సమర్పిస్తే తప్ప పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి పెద్దఎత్తున లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఫిర్యాదులపైనే స్పందిస్తారనే ప్రచారం..
ఏసీబీ అధికారులు తమ దృష్టికి వచ్చినా ఫిర్యాదులపైనే స్పందిస్తారనే ప్రచారం ఉంది. బాధితులు వెళ్లి వారిని సంప్రదిస్తేనే వస్తారని.. లేకుంటే ఉదాసీనంగా వ్యవహరించి గాలికి వదిలేస్తారనే అభిప్రాయం లేకపోలేదు. అయితే నిఘా ఉంచి జిల్లాలో దాడులు మరింత పెంచితే తప్ప అవినీతిరాయుళ్ల ఆటకట్టించే అవకాశం కనిపించడం లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏసీబీ అధికారుల తనిఖీలు ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు సైతం బరితెగించి లంచావతారం ఎత్తారు. పైసలిస్తే తప్ప పనిచేయని దుస్థితి. ఏడాదికి కనీసం 15 కేసులు మించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
కొంత అలజడి..
కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు ఆశించిన స్థాయిలో లేవు. అయినప్పటికీ పలు శాఖల్లో అవినీతి అధికారుల్లో మాత్రం కొంత అలజడి ఉంది. పలు శాఖల్లో పనిచేస్తున్న అవినీతి అధికారులు, సిబ్బంది నేటికీ లంచాలకు చేయి చాపుతుండటం గమనార్హం. పట్టుబడిన సందర్భంలో మాత్రం ఉద్యోగులు, ఆయా శాఖల్లో కలవరం రేపుతోంది. తాజాగా ఆళ్లగడ్డ విద్యుతశాఖ ఏడీఈ రవికాంతచౌదరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కళ్లు చెదిరే ఆస్తులు, బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ రేపింది.
సమాచారం అందిస్తే చర్యలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవినీతిపరులు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అధికారులు, సిబ్బందిపై తమకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులను నియంత్రించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగులతో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. బాధితులు నేరుగా లేదంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1064 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
- సోమన్న, డీఎస్పీ, ఏసీబీ కర్నూలు