Agricultural University: వ్యవసాయ వర్సిటీలో గోల్‌మాల్
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:36 AM
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వీసీ భ్రష్ఠు పట్టిస్తున్నారని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు.
కోరం లేకుండానే రూ.500 కోట్లు డ్రా .. బదిలీల్లోనూ అవినీతి
వీసీపై గవర్నర్‌కు ఓ ఫ్రొఫెసర్ ఫిర్యాదు
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వీసీ భ్రష్ఠు పట్టిస్తున్నారని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ‘వర్సిటీ పాలక మండలి సమావేశాలు గత రెండేళ్ల నుంచి కోరం లేకుండానే వీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక కమిటీని ఏర్పాటు చేయాలన్న నిబంధనను కూడా వీసీ తుంగలో తొక్కి వర్సిటీ నిధులు రూ.500 కోట్ల వరకూ డ్రా చేశారు. వర్సిటీకి సంబంధించిన సివిల్ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం ఎస్టేట్ అధికారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. 2023-24లో 187 మంది, 2024-25లో 285 మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వీసీకి డబ్బు, బంగారం, విలువైన చీరలు ఇచ్చినవారికి మాత్రమే ప్రాధాన్య పోస్టులు ఇచ్చారు. నా బదిలీకి కూడా లంచం డిమాండ్ చేశారు. ఈ ముడుపుల సొమ్ముతో కర్నూలులో రూ.కోట్ల వ్యయంతో వీసీ ఇల్లు నిర్మించుకున్నారు. తాత్కాలిక వీసీ పర్యటనల వివరాలు కచ్చితంగా గవర్నర్‌కు తెలియజేయాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఉద్యోగులను వీసీ బెదిరిస్తున్నారు. వాహనాల పేరుతో కూడా నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. వీసీని వెంటనే పదవి నుంచి తొలగించి ఏసీబీ, విజిలెన్స్, ఈడీ అధికారులతో విచారణ జరిపించాలి’ అని సదరు ప్రొఫెసర్ తన ఫిర్యాదులో గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.