Share News

Corruption Allegations: అవినీతి ఆరోపణలున్నా బేఖాతరు

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:56 AM

విద్యుత్తు పంపిణీ సంస్థల్లో (డిస్కం) అవినీతి ఆరోపణలు ఉన్నవారినే అందలం ఎక్కిస్తున్నారు. వైసీపీ హయాంలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కె.సంతోషరావు ప్రస్తుతం...

Corruption Allegations: అవినీతి ఆరోపణలున్నా బేఖాతరు

  • ఐఏఎస్‌ నియామకం ఆనవాయితీకి తిలోదకాలు

  • ఈపీడీసీఎల్‌ సీఎండీగా సంతోషరావు !

  • ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శ్రీనివాసమూర్తి!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్తు పంపిణీ సంస్థల్లో (డిస్కం) అవినీతి ఆరోపణలు ఉన్నవారినే అందలం ఎక్కిస్తున్నారు. వైసీపీ హయాంలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కె.సంతోషరావు ప్రస్తుతం ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ఉన్నారు. 2023 ఏప్రిల్‌లో నియమితులైన ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తయిపోయినా, తదుపరి ఉత్తర్వులు వరకు అంటూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంతటితో ఆగకుండా డిస్కంల్లో కీలకమైన ఈపీడీసీఎల్‌ సీఎండీగా ఆయన్ను నియమించేందుకు శరవేగంగా ఫైలు కదులుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాటి నుంచి ఈపీడీసీఎల్‌ సీఎండీగా ఐఏఎస్‌ అధికారులను నియమించడం ఆనవాయితీగా ఉంది. వైసీపీ హయాంలో ఆ ఆనవాయితీని తుంగలో తొక్కారు. 2021లో సంతోషరావును ఈపీడీసీఎల్‌ సీఎండీగా నియమించారు. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్‌ అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. తీవ్ర ఆరోపణలు రావడంతో 2023 ఏప్రిల్‌లో ఈపీడీసీఎల్‌ బాధ్యతను ఐఏఎస్‌ అధికారి పృథ్వీతేజకు కట్టబెట్టి, సంతోషరావును ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా పూర్తిస్థాయిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో సంతోషరావుపై తీవ్ర అవినీతి ఆరోపణల్లో.. ఆర్డీఎస్‌ పనులు 20 శాతం పూర్తి కాకుండానే 50 శాతం పూర్తయినట్లు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడం, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రూ. 75 వేలు అధికంగా చెల్లించి ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేయడం తదితరాలు ఉన్నాయి. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న సంతోషరావును తిరిగి ఈపీడీసీఎల్‌కు తీసుకువచ్చేందుకు నియామక ఫైలు చకచకా కదులుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయయి. మరోవైపు సంతోషరావు స్థానంలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శ్రీనివాసమూర్తిని నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గతంలో ఈయనపైనా తీవ్రఅవినీతి ఆరోపణలు వచ్చాయి.

Updated Date - Sep 12 , 2025 | 05:58 AM