Share News

కార్పొరేషన్‌కు రూ.కోటి ఎగనామం!

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:03 AM

అవినీతి అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఏ ప్రభుత్వంలో అయినా అక్రమాలను చేసేయెచ్చు అనే నానుడిని బాగా వంట బట్టించుకున్న వైసీపీకి చెందిన ఓ బిల్డర్‌ కూటమి ప్రభుత్వంలో దర్జాగా కార్పొరేషన్‌కు రూ. కోటి వరకు ఎగనామం పెట్టారు. పాలక పక్షం అండదండులు పుష్కలంగా ఉండటంతో ఫీజులు అడిగే సాహసం అధికారులు చేయడంలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కార్పొరేషన్‌కు రూ.కోటి ఎగనామం!

- పాలకపక్షం అండతో వైసీపీకి చెందిన ఓ బిల్డర్‌ నిర్వాకం

- వీఎల్‌టీ, బెటర్మెంట్‌, 14 శాతం ఫీజులు చెల్లింపులు బంద్‌

- డబ్బులు కట్టించుకోకుండా చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్‌

- వైఎస్‌ విగ్రహానికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన బిల్డర్‌

అవినీతి అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఏ ప్రభుత్వంలో అయినా అక్రమాలను చేసేయెచ్చు అనే నానుడిని బాగా వంట బట్టించుకున్న వైసీపీకి చెందిన ఓ బిల్డర్‌ కూటమి ప్రభుత్వంలో దర్జాగా కార్పొరేషన్‌కు రూ. కోటి వరకు ఎగనామం పెట్టారు. పాలక పక్షం అండదండులు పుష్కలంగా ఉండటంతో ఫీజులు అడిగే సాహసం అధికారులు చేయడంలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలోని సితార థియేటర్‌ వెనుక ప్రాంతంలో వైసీపీ నాయకుడు, బిల్డర్‌ అయిన ఓ వ్యక్తి సుమారు 1700 గజాల స్థలంలో జీ ప్లస్‌-4 విధానంలో అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ స్థలం ఆయన సొంతది కాదు. మొత్తం 16 మంది భూ యజమానుల నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారు. భూ యజమానులతో 50 - 50 విధానంలో ఫ్లాట్స్‌ ఇచ్చేవిధంగా ఆ బిల్డర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. భూ యజమానులకు 24 ఫ్లాట్స్‌ ఇవ్వగా మిగిలిన 26 ఫ్లాట్స్‌ను తాను తీసుకుంటారు. కూటమి ప్రభుత్వంలోనే నిర్మాణం చేపట్టారు. శరవేగంగా నిర్మాణం కూడా పూర్తి అయింది. భవన నిర్మాణ విషయంలో కూడా చాలా వరకు నిబంధనల మేరకే పనులు చేపట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన ఫీజుల విషయంలో మాత్రం ఎగనామం పెట్టారు. కార్పొరేషన్‌ అధికారులకు ఈ విషయం తెలిసినా కూడా కిమ్మనటం లేదు.

నాన్‌ లే అవుట్‌ ఏరియా నిర్మాణం

ఇది నాన్‌ లే అవుట్‌ ఏరియా కావటంతో 14 శాతం చార్జీలను కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో గజం రూ.33 వేలు ఖరీదు చేస్తోంది. ఈ లెక్కన చూస్తే దీని కింద రూ.70 లక్షల వరకు కార్పొరేషన్‌కు బిల్డర్‌ చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్‌ పైసా కూడా కట్టలేదని తెలుస్తోంది. డెవలప్‌మెంట్‌కు తీసుకున్న స్థలాల్లో కొన్నింటికి వీఎల్‌టీ కూడా చెల్లించలేదని సమాచారం. కార్పొరేషన్‌కు బెటర్మెంట్‌ పేరుతో చెల్లించాల్సిన డబ్బులను కూడా చెల్లించలేదని తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే మొత్తంగా రూ. ఒక కోటి వరకు కార్పొరేషన్‌కు ఎగనామం పెట్టినట్టు సమాచారం. కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కనీసం కట్టాల్సిన డబ్బుల గురించి మాట కూడా అడగటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే కార్పొరేషన్‌లో వైసీపీ పాలకపక్షం ఉంది. పాలకపక్ష పెద్దల నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లకు డబ్బులు ఇవ్వటం వల్ల ఎవరూ కిమ్మనటం లేదని తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటుకు రూ. 15 లక్షల వరకు విరాళంగా ఇచ్చిన ఈ బిల్డర్‌ కార్పొరేషన్‌కు మాత్రం కట్టాల్సిన రూ. కోటిని వైసీపీ పాలకపక్షాన్ని అడ్డం పెట్టుకుని చెల్లించటంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jul 21 , 2025 | 01:03 AM