ఆ డీఎస్పీకి రఘురామ కితాబు సరికాదు: కొత్తపల్లి
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:16 AM
విచారణను ఎదుర్కొంటున్న డీఎస్పీ జయసూర్యకు కితాబు ఇస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.
నరసాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విచారణను ఎదుర్కొంటున్న డీఎస్పీ జయసూర్యకు కితాబు ఇస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నరసాపురంలోని తన నివాసంలో కొత్తపల్లి విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ మాటలతో విచారణపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. పేకాట క్లబ్‌లు, సెటిల్‌మెంట్లు, ఇతర అంశాల్లో డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమని కోరారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమని చెప్పలేదు. పవన్ ఇచ్చిన ఆదేశాలతో విచారణ జరుగుతుండగా రఘురామకృష్ణరాజు, డీఎస్పీ మంచివాడని కితాబివ్వడం సరికాదు. డిప్యూటీ స్పీకర్ హోదాలో పేకాట క్లబ్‌ల గురించి పబ్లిక్‌గా మాట్లాడం సరికాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట సహజమని చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉంది. డిప్యూటీ సీఎంకు, రఘురామకృష్ణరాజుకు మంచి స్నేహం ఉంది. పబ్లిక్‌గా మాట్లాడకుండా నేరుగా పవన్‌తో చర్చించి ఉంటే బాగుండేది’ అని కొత్తపల్లి హితవు పలికారు.