Share News

CM Chandrababu Naidu: కార్పొరేట్‌ వైద్యం అందిస్తే నష్టమేంటి

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:48 AM

ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తే వచ్చే నష్టం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.

CM Chandrababu Naidu: కార్పొరేట్‌ వైద్యం అందిస్తే నష్టమేంటి

  • పీపీపీ విధానంపై వైసీపీకి సీఎం సూటి ప్రశ్న

  • రుషికొండను తెల్లఏనుగుగా మార్చారు

  • ఆ ఖర్చుతో మరో రెండు కాలేజీలు వచ్చేవి

  • పీపీపీపై ఉద్దేశపూర్వక విమర్శలకు వెరవద్దు

  • నిజాలను నేరుగా ప్రజలకు చెబుదాం

  • కలెక్టర్లు, మంత్రులకు చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తే వచ్చే నష్టం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలకు భయపడాల్సిన పనిలేదని, ప్రజలకు మంచి అనుకున్నదే, వెనక్కు తగ్గకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు నిర్వహణకు ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ దీన్ని వ్యతిరేకిస్తోంది. మెడిక ల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపఽథ్యంలో దీనిపై కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ పేరు, ప్రస్తావన తీసుకురాకుండా, కొందరు నాయకులు మెడికల్‌ కాలేజీలు ప్రెవేటు చేశారంటూ మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కేంద్రంలోని నీతి ఆయోగ్‌ ముందడుగు వేసి పీపీపీ, హైబ్రిడ్‌, వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ వంటి అనేక విధానాలను తీసుకొచ్చిందన్నారు. ఒక పక్క ప్రజా సంక్షేమం, మరో పక్క అభివృద్ధి చేయాలి కాబట్టే, రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వంలా నిబద్ధత లేని నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. ‘‘పీపీపీలో ఇచ్చే కాలేజీకి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అన్న పేరే ఉంటుంది. పక్కన చిన్న అక్షరాల్లో దాన్ని నిర్వహించే వారి (ప్రైవేటు) పేరు ఉంటుంది. ఆస్తి ప్రభుత్వానిదే. గైడ్‌లైన్స్‌ ఇచ్చి నియంత్రించేదీ ప్రభుత్వమే. ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా సీట్లు పెరుగుతున్నాయి. 100 శాతం ఔట్‌ పేషంట్లకు చికిత్స ఉచితం.


ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ఉత్తమంగా చికిత్స దొరుకుతుంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ నుంచి పంపించిన ఇన్‌ పేషంట్లు 70 శాతం ఉంటారు. ఒకప్పుడు వీళ్లే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి కర్ణాటక, హైదరాబాద్‌, చెన్నైకి పంపించారు. ఎందుకు? అంటే ప్రభుత్వ సర్వీసులు చాలవనే కదా.? అలాంటప్పుడు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలు అందిస్తే మీకు నష్టం ఏమిటి? మీరేమైనా ఈ ప్రాజెక్టులు పూర్తిచేయలేదు కదా?’’ అంటూ జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు ప్రశ్నించారు. రూ.500 కోట్లు రుషికొండ ప్యాలె్‌సపై పెట్టి, పర్యావరణాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. ‘‘అదే డబ్బు పెడితే రెండు కాలేజీలు వచ్చేవి. వాళ్లది నిబద్ధత లేని పరిపాలన. నేనయితే ఆ పని చేయను. అలాంటి పని చేయనివ్వను. ఇప్పుడు అది తెల్ల ఏనుగులా తయారయింది.’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, 13-14 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ వడ్డీ భారం అతిపెద్ద సమస్యగా మారుతోందన్నారు. గత ప్రభుత్వం అనాలోచిత ధోరణితో అప్పులు, ఖర్చులు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాలూ ఎస్టాబ్లిషమెంట్‌ ధరలు తగ్గిస్తే ఏపీ అప్పట్లో 100 శాతం చేసిందని, రాష్ట్ర ఆదాయం మొత్తం దానికే సరిపోయిందన్నారు. తాము వచ్చాక ఆర్థిక శాఖను కూర్చోబెట్టి చర్చించి పనితీరు, విశ్వసనీయతను పెంచామని వివరించారు. ఇప్పుడు 9 శాతం వడ్డీకి మించి అప్పులు తీసుకోవడం లేదని, తాము తీసుకుంటున్న చర్యల వల్ల దాదాపు 25శాతం వడ్డీ తగ్గుతోందన్నారు. రుణ వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటున్నామని, కొత్తగా సందనను సృష్టించడంతోపాటు, ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నామని వివరించారు. అందువల్ల పీపీపీ విధానంలో ఉన్న నిజాలు ప్రజలకు తెలియజేద్దామని కలెక్టర్లు, మంత్రులకు సీఎం సూచించారు.


సూపర్‌ సిక్స్‌ అమలుకు క్యాలెండర్‌

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్‌ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలకు విస్తరించాలన్నా రు. హాస్టళ్లలో ఏం జరిగినా ముందు వార్డెన్లను సస్పెండ్‌ చేసి, ఆ తర్వాతే మాట్లాడతామని హెచ్చరించారు. పీ4 కింద సంక్షేమ హాస్టళ్లను దత్తత తీ సుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. గిరిజన కార్పొరేషన్‌ ద్వారా కొన్ని హోటళ్లు కట్టి.. వాటి నిర్వహణను కార్పొరేట్లకు ఇస్తే పర్యాటకులు పెద్ద ఎత్తు న వచ్చే అవకాశముందన్నారు. అన్నీ శాఖల్లో ఎస్సీ కాంపోనెంట్‌ నిధులతో తగిన వసతులు కల్పించాలంటూ కలెక్టర్లను సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్‌ ఆదేశించారు.

Updated Date - Dec 18 , 2025 | 05:50 AM