AP DGP Harish Kumar Gupta: సహకారం, సమన్వయం కీలకం
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:24 AM
ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లు, సమస్యలపై అధికారులందరూ ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి కార్యాచరణ కీలకం
దక్షిణ భారత ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ సమావేశం
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లు, సమస్యలపై అధికారులందరూ ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. తిరుపతి వేదికగా శుక్రవారం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి డీజీపీలు, ఉన్నతస్థాయి పోలీసు అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్వాగత ఉపన్యాసం చేశారు. సదస్సులో ఉగ్రవాద కార్యకలాపాలు, గ్యాంగులు, డ్రగ్ మాఫియా, అక్రమ ఆయుఽధ రవాణా, అంతర్రాష్ట్ర నేరస్థుల డేటా బేస్‌ను తయారు చేయడం, సామూహిక ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఉగ్రవాద సమాచార పంపకాల వ్యవస్థ, సైబర్ నేరాలు, టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్థాపనపై చర్చించారు. ‘మహిళల కిడ్నాప్, ట్రాఫికింగ్ కేసులపై సంయుక్త విచారణ, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే రెచ్చగొట్టే అంశాలపై నిఘా, పోలీసు శిక్షణ, సామర్థ్యం పెంపుపై పరస్పర సహకారం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం, ప్రధాన రవాణా మార్గాలకు సంబంధించి సమాచారం పంచుకోవడం...’ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు అంతర్రాష్ట్ర నేరస్థుల డేటాబేస్‌ను తయారు చేసి సమష్ఠిగా నిఘా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కేరళ డీజీపీ రావాడ చంద్రశేఖర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత డీజీపీ శాలిని సింగ్, ఎనిమిది మంది అదనపు డీజీలు, 9 మంది ఐజీలు, 12 మంది డీఐజీలు, 16 మంది ఎస్పీలతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్‌ఫీఎఫ్, సీఐఎస్ఎఫ్, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ తదితర కేంద్ర విభాగ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం జరిగిన గ్రాండ్ రిడ్జ్ హోటల్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.