CPM Politburo Member BV Raghavalu: రుషికొండను మ్యూజియంగా మార్చండి
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:25 AM
విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన అత్యాధునిక భవనాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటు చేయాలని...
అమరావతిలో జూ, బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీవీ రాఘవులు లేఖ
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన అత్యాధునిక భవనాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటు చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి మ్యూజియం రాష్ట్రంలోని బాలబాలికల మనోవిజ్ఞాన వికాసాలకు, టూరిజం అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. రుషికొండ రిసార్ట్స్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై సూచనలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం... నిర్ణయం తీసుకునే ముందు తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నానంటూ సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాశారు. అన్ని ప్రముఖ నగరాల్లో ప్రసిద్ధిగాంచిన సైన్స్ మ్యూజియంలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని కోరారు. కొత్త రాష్ట్రానికి అన్ని హంగులతో నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో భవిష్యత్తు తరాల విజ్ఞాన, వినోద సాధనాలుగా సైన్స్ మ్యూజియం, జంతు ప్రదర్శనశాల, బొటానికల్ గార్డెన్ ఏర్పాటు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలని రాఘవులు కోరారు.