AP Politics: ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:08 AM
పదవులకు రాజీనామా చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.
వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జాకియా ఖానం
రాజీనామా చేసిన ఆరుగురు సభ్యులతో మోషేన్‌రాజు ముఖాముఖి భేటీలు
రాజీనామా ఎందుకు చేశారు?
ఎవరైనా పదవుల ఆశ చూపారా?
రాజీనామాకు ముందు,
తర్వాత ఎవరిని కలిశారు?
ఆ లేఖల ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారంటూ ప్రశ్నలు
చైర్మన్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ సభ్యుల ధ్వజం
రాజీనామా మా రాజ్యాంగ హక్కు
దానిని ఆయన హరిస్తున్నారు
బలవంతంగా రాజీనామా చేశామన్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు
రాజీనామాలకు కట్టుబడే ఉన్నామన్న మిగిలిన ఐదుగురు ఎమ్మెల్సీలు
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పదవులకు రాజీనామా చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. వారిని సోమవారం పిలిపించి ‘కౌన్సెలింగ్’ ఇచ్చారు. దీంతో ఆ ఆరుగురిలో ఒకరైన జాకియా ఖానం రాజీనామా ఉపసంహరించుకోవడం గమనార్హం. ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిగతా ఐదుగురు సభ్యులు విమర్శిస్తున్నారు. రాజ్యాంగంలోని 190 (3)(బీ) అధికరణ ప్రకారం ఎమ్మెల్సీ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారా.. రాజీనామా లేఖ అసలైనదేనా అన్న విషయాలను మాత్రమే నిర్ధారించుకోవలసి ఉండగా.. చైర్మన్ మాత్రం తమ రాజీనామాను ఉపసంహరించుకుని, వైసీపీ సభ్యులుగానే కొనసాగేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీలు తమ రాజీనామా లేఖలను సమర్పించాక నెల రోజుల్లోపే వాటిని ఆమోదించడం గానీ, తిరస్కరించడం గానీ చేయాలి. కానీ ఆ ఆరుగురిలో నలుగురు రాజీనామాలు చేసి ఏడాది దాటినా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీంతో వారిలో ఒకరైన జయమంగళ వెంకటరమణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చైర్మన్ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. నాలుగు వారాల్లోపు ఎమ్మెల్సీల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో ఆయన హడావుడిగా ఆరుగురు ఎమ్మెల్సీలు.. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణచక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, జాకియా ఖానంలకు డిసెంబరు 1న తన ఎదుట హాజరుకావాలని నోటీసులు పంపారు.
ఎవరి ప్రోద్బలంతో రాజీనామా చేశారు..?
రాజీనామా చేసిన ఆరుగురూ సోమవారం మండలి చైర్మన్‌తో సమావేశమయ్యారు. ఆయన వారితో ముఖాముఖి భేటీలు జరిపారు. ‘మీరు రాజీనామా ఎందుకు చేశారు.. ఎవరైనా పదవి ఆశ చూపారా.. రాజీనామాపై పునరాలోచన చేస్తారా.. రాజీనామా చేయడానికి ముందు మీరు ఎవరిని కలిశారు.. ఆ తర్వాత ఎవరిని కలిశారు.. రాజీనామా చేయాలని మీకు ఎవరు చెప్పారు.. రాజీనామా లేఖ ప్రింట్ ఎక్కడ తీసుకున్నారు..’ వంటి ప్రశ్నలతో ఆయన కౌన్సెలింగ్ సాగించారని వారు విమర్శించారు. తాను ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని, దానికి కట్టుబడి ఉన్నట్లు చైర్మన్‌కు స్పష్టంగా చెప్పానని మర్రి రాజశేఖర్ మీడియాకు తెలిపారు. ‘నా రాజీనామాను నెల రోజుల్లో ఆమోదించాల్సి ఉన్నా తాపీగా ఇప్పుడు విచారణకు పిలిపించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెబుతున్నా.. చైర్మన్ మాత్రం బలవంతంగా రాజీనామా చేశాననే సాకుతో నా రాజీనామాను తిరస్కరించే ఉద్దేశంతో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రశ్నలు అడిగారు’ అని ఆక్షేపించారు. జనసేన నీకు ఏమిస్తోంది.. మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తామన్నారా అని చైర్మన్ అడిగారు. నాకు పదవుల సంగతి తర్వాత.. ముందు నా రాజీనామా ఆమోదించాలని ఆయన్ను కోరాను’ అని జయమంగళ వెంకటరమణ తెలిపారు. చెప్పారు.
ఎందుకిలా..?
రాజీనామా చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల్లో ఒక్క జాకియా ఖానం పదవీకాలం మాత్రమే 2026 జూలైతో ముగియనుంది. కల్యాణచక్రవర్తి పదవీకాలం 2027 వరకు ఉండగా మిగిలిన నలుగురి పదవీకాలం 2029 వరకు ఉంది. ఈ కారణంగానే వారి రాజీనామాలను ఆమోదించకుండా సాగదీస్తూ వస్తున్నారు. న్యాయస్థానం జోక్యంతో 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో.. మండలి చైర్మన్ కౌన్సెలింగ్‌కు తెరదీశారని ఆ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. కౌన్సెలింగ్ ఫలించని పక్షంలో బలవంతంగా రాజీనామాలు చేశారన్న సాకుతో తమ రాజీనామాలను తిరస్కరించే యోచనలో చైర్మన్ ఉన్నారని అంటున్నారు. సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదనే అనుమానం ఉన్నప్పుడు మాత్రమే విచారణ జరపాలని రాజ్యాంగం చెబుతోందని.. తామే స్వయంగా రాజీనామా పత్రాలు ఇచ్చినా.. స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని చెబుతున్నా.. ఆయన విచారణకు పిలిపించడం.. ఇక్కడ రాజీనామాలు ఉపసంహరించుకునేలా కౌన్సెలింగ్ ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
జాకియా ఉపసంహరణ లేఖ
చైర్మన్ కౌన్సెలింగ్ పేరుతో చేసిన మంత్రాంగం ఫలితాన్నిచ్చింది. మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానంతో మాట్లాడే సమయంలో.. పదవీకాలం మరో 7 నెలలే ఉన్నందున రాజీనామా వల్ల ఉపయోగం లేదని, తక్కువ కాలమే ఉన్నందున పదవిలో కొనసాగాలని ఆయన సూచించారు. దీంతో భేటీ అనంతరం ఆయన సూచనలకు అంగీకరించి రాజీనామా ఉపసంహరించుకుంటూ ఆమె లేఖ ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి ఈ ఏడాది మేలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వెంటనే బీజేపీ కండువా కప్పుకొన్నారు. నిబంధనల ప్రకారం ఆమెపై అనర్హత వేటు వేయాల్సిన చైర్మన్.. బుజ్జగించి.. రాజీనామా లేఖను ఉపసంహరించుకునేలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ఎమ్మెల్సీల రాజీనామాలు ఎప్పుడెప్పుడు..?
కర్రి పద్మశ్రీ..: 2023 ఆగస్టు 10న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక.. 2024 ఆగస్టు 30న రాజీనామా.
బల్లి కల్యాణచక్రవర్తి: 2021 మార్చి 30న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నిక.. 2024 ఆగస్టు 30న రాజీనామా.
పోతుల సునీత: 2023 మార్చి 30న ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక.. 2024 ఆగస్టు 30న రాజీనామా.
జయమంగళ వెంకటరమణ: 2023 మార్చి 30న ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక.. 2024 నవంబరు 24న రాజీనామా.
మర్రి రాజశేఖర్: 2023 మార్చి 30న ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక.. ఈ ఏడాది మార్చి 20న రాజీనామా.
మయాన జాకియా ఖానం: 2020 జూలై 28న గవర్నర్ కోటాలో ఎన్నిక.. 2021 నవంబరులో మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక.. ఈ ఏడాది మే 14న పదవికి రాజీనామా.. తాజాగా ఉపసంహరణ.