Share News

Education Department: ఎంఈవో పోస్టుల్లో ఖాళీలకు ఇన్‌చార్జ్‌లు

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:02 AM

ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టులకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ బుధవారం జోన్‌ 3, 4 ఆర్జేడీలు ఉత్తర్వులు జారీ చేశారు.

Education Department: ఎంఈవో పోస్టుల్లో ఖాళీలకు ఇన్‌చార్జ్‌లు

  • ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ టీచర్లకు అవకాశం

  • వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టులకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ బుధవారం జోన్‌ 3, 4 ఆర్జేడీలు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లనే చాలావరకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని మేనేజ్‌మెంట్ల టీచర్లకు ఉమ్మడి సీనియారిటీ తీసుకుని భర్తీ చేయాల్సిన పోస్టులకు కేవలం ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ టీచర్లనే నియమించడాన్ని సంఘాలు తప్పుబట్టాయి. ఎంఈవో-1 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) డిమాండ్‌ చేసింది. జోన్‌-2 పరిధిలో ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లను మాత్రమే ఎంఈవో-1లుగా భర్తీ చేసేందుకు సమాచారం సేకరించడాన్ని తప్పుబట్టింది. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ జీవోలు 72, 73, 74 అమలు చేయాల్సిన అధికారులే సమన్యాయం పాటించకుండా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.సాయి శ్రీనివాస్‌, ఎస్‌.చిరంజీవి ఓ ప్రకటనలో ఆరోపించారు. ఎంఈవోలకు బదిలీలు నిర్వహించి ఖాళీలను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎంఈవో ఖాళీలను ప్రభుత్వ యాజమాన్య టీచర్లతోనే కాకుండా ఉమ్మడి సీనియారిటీతో భర్తీ చేయాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఎంఈవో పోస్టులకు ఇన్‌చార్జ్‌ ఏర్పాట్లలో జడ్‌పీ హెచ్‌ఎంలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ కోరారు.

Updated Date - Jul 31 , 2025 | 06:03 AM