Controversy Over Cosmetics Tender: కాస్మెటిక్స్ కాంట్రాక్టులో కిరికిరి
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:37 AM
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మెటిక్ సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియ అభాసుపాలైంది..
అర్హత లేని సంస్థకు 17 కోట్ల టెండరు
వైసీపీ కీలక నేత మిత్రుడి సంస్థకు లబ్ధి!
సీఎంకు ఫిర్యాదులు..పేషీకి ఆదేశాలు!
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మెటిక్ సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియ అభాసుపాలైంది. టెండరు వేసే సంస్థకు రూ.9 కోట్ల విలువైన కాస్మెటిక్ వస్తువులు సరఫరా చేసిన అనుభవం ఉండాలని నిబంధనల్లో పేర్కొని, కేవలం రూ.2.2 కోట్ల విలువైన సరఫరా అనుభవం మాత్రమే కలిగిన సంస్థను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు నిబంధనలను అడ్డగోలుగా పక్కనపెట్టేసి.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన విక్టరీ బజార్ సంస్థకు రూ. 17.95 కోట్ల విలువైన టెండరు కట్టబెట్టారు. ఇది వైసీపీ కీలక నేత మిత్రుడి సంస్థ కావడం గమనార్హం. ఈయనకు టెండర్ కట్టబెట్టేందుకు సాంఘిక సంక్షేమశాఖలోని కొందరు అధికారులు శాయశక్తులా సహకరించారనే ఆరోపణలు వినిపించాయి. దీనికోసం నాణ్యత విషయంలోనూ రాజీ పడ్డారని విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. గతంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు ప్రతినెలా ఆయా తరగతుల వారీగా నగదు రూపంలో చెల్లించేవారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చొరవతో కాస్మెటిక్ చార్జీలను పెంచారు. మూడో తరగతి నుంచి ఆరో తరగతి విద్యార్థుల వరకు బాలురకు నెలకు రూ.125, బాలికలకు రూ.130; ఏడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బాలురకు రూ.150, బాలికలకు రూ.200, ఇంటర్ ఆ పైబడిన విద్యార్థులకు బాలురకు రూ.200, బాలికలకు రూ.250 పెంచారు. గతంలో నగదు ఇవ్వడంతో విద్యార్థులు కాస్మెటిక్స్‌కు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో విద్యార్థులకు నేరుగా కాస్మెటిక్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. ఈ కిట్‌లో కొబ్బరినూనె, టూత్‌పే్‌స్ట, టూత్‌బ్ర్‌ష, టాల్కమ్ పౌడర్, షాంపూ, వంటి, డిటర్జెంట్ సబ్బులు, శానిటరీ నాప్‌కిన్స్, వాషింగ్ పౌడర్, స్టిక్కర్లు, దువ్వెన ఉంటాయి. కాస్మెటెక్స్‌ను సరఫరా చేసే సంస్థ కోసం సెప్టెంబరు 29న టెండర్లు నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబరు 13న ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్ తెరిచారు. మొత్తం రూ.17.95 కోట్ల బిడ్‌ను అడ్డగోలుగా వైసీపీ కీలక నేత మిత్రుడికి చెందిన సంస్థకు కట్టబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. గత నెల 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబరు 31 దాకా ఈ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు.
డాక్యుమెంట్‌లో ‘కిట్’ మాయం
టెండర్ల నోటిఫికేషన్‌లో ఆర్భాటంగా బేబీకేర్ కిట్, ఫేసియల్ కిట్ అని పేర్కొన్నారు. కానీ రావులపాలెం విక్టరీ బజార్‌కు టెండరు కట్టబెట్టేందుకు డాక్యుమెంట్‌లో కిట్ అనే పదం తొలగించారు. జెమ్ (గవర్నమెంట్ ఈ-మార్కెట్) ప్రకటనకు విరుద్ధంగా టెండర్లు పిలిచారు. బిడ్డర్లు మూడేళ్లలో కనీసం రూ.9 కోట్ల విలువైన కాస్మెటిక్స్ ప్రభుత్వానికి లేక ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు సరఫరా చేసిన అనుభవం కలిగి ఉండాలి. దానికి సంబంధించి బిడ్డర్ పర్చేజ్ ఆర్డర్, పేమెంట్ ఓచర్స్, కంప్లీషన్ సర్టిఫికెట్లు, సప్లయ్ కాపీలు జోడించాలని నిబంధనల్లో ఉంది. రిటైల్ సరఫరాను పరిగణనలోకి తీసుకోరు. అయితే విక్టరీ బజార్ సంస్థ రూ.2.2 కోట్ల విలువైన కాస్మెటిక్స్‌ను రిటైల్‌గా సరఫరా చేసినట్టు డాక్యుమెంట్లు జతచేసింది. అది కూడా రావులపాలెంలోని కొన్ని కిరాణా షాపులకు సరఫరా చేసినట్లు ఆడిట్ నివేదికలు సమర్పించింది. ఆ డాక్యుమెంట్లను, ఆడిట్ నివేదికలను గుడ్డిగా పరిగణనలోకి తీసుకుని టెండర్ ఖరారు చేయడం గమనార్హం. ఇతర సంస్థలు కాస్త నాణ్యమైన చిక్ సాచెట్, షాంపూలు తెస్తే అంగీకరించలేదుగానీ, విక్టరీ బజార్ తెచ్చిన నాసిరకం చిక్ శాంపిల్స్‌ను ఆమోదించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంత మంది టీడీపీ నేతలు, పలు సరఫరా సంస్థలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పరిశీలించాలని పేషీ అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం.