Share News

Legislative Council Debate: మండలిలో ఎమ్మెల్యే దుమారం

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:38 AM

ముఖ్యమంత్రి చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ సంబోధించడం గురువారం శాసనమండలిలో పెద్ద దుమారం రేపింది.

Legislative Council Debate: మండలిలో ఎమ్మెల్యే దుమారం

  • కుప్పం ఎమ్మెల్యే అంటూ సీఎం చంద్రబాబును ఏకవచన సంబోధన చేసిన వైసీపీ సభ్యుడు

  • తీవ్ర అభ్యంతరం తెలిపిన కూటమి సభ్యులు

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ సంబోధించడం గురువారం శాసనమండలిలో పెద్ద దుమారం రేపింది. సభానాయకుడిని ఎమ్మెల్యే అంటూ ఏకవచనంతో మాట్లాడతారా.... అంటూ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎంను అగౌరవపర్చినందుకు వైసీపీ సభ్యుడితో సభకు క్షమాపణ చెప్పించాలని మండలి చైర్మన్‌ను అధికార పక్షం పట్టుబట్టగా, వైసీపీ సభ్యులు నిలబడి వాదనకు దిగారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. నాటి కుప్పం ఎమ్మెల్యే అని తమ సభ్యుడు సంబోధించారంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉద్ధేశపూర్వకంగానే చంద్రబాబును అగౌరవపర్చారంటూ టీడీపీ సభ్యు లు చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలను పరిశీలించి, రికార్డుల నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని మంత్రులు, అధికార పక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. జగన్‌ను మాఫియా డాన్‌ అంటే వైసీపీ సభ్యులు ఒప్పుకొంటారా... అని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై అధికార పక్ష, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. అంతకుముందు...ప్రభుత్వ ’సూపర్‌సిక్స్‌’ పథకాలపై శాసనమండలిలో లఘు చర్చ జరిగింది. వైసీపీ సభ్యుడు రమేశ్‌యాదవ్‌ మాట్లాడుతూ, ‘‘సూపర్‌సిక్స్‌ అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి బాండ్లు ఇచ్చారు. బీటెక్‌, ఎంటెక్‌లు చదివి, తెలంగాణలో ఉన్న ఏపీ విద్యార్థులకు కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఉద్యోగాలిస్తామంటే.. వాళ్లు వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. కానీ, ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు’’ అని విమర్శించారు. ఇదే సందర్భంలో...‘‘జగన్‌ ఒక్క సంతకంతో ఆనాడు లక్షా32వేల సచివాలయ ఉద్యోగాలిచ్చారు. కావాలంటే కుప్పం ఎమ్మెల్యే పరిశీలించుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.


సభ్యుడు క్షమాపణ చెప్పాలి

రమేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై మంత్రులు, అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, సభ్యుడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎంను అగౌరవపర్చినందుకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేయగా, సీఎం సభా నాయకుడన్న విషయం మరిచిపోయి ఎమ్మెల్యే అని ఎలా సంబోధించారని మంత్రి మనోహర్‌ నిలదీశారు. ‘‘మెగా డీఎస్సీ నిర్వహించి, టీచర్‌ అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటగా ఉంటే జల్‌సిల్‌ మాత్రలు పంపుతాం.. వేసుకోని, కడుపు మంట తగ్గించుకోండి’’ అంటూ మంత్రి కేశవ్‌ ఎద్దేవా చేశారు. విపక్ష నేత బొత్స మాట్లాడుతూ.. సూపర్‌సిక్స్‌పై చర్చ జరగాలని ప్రభుత్వమే బీఏసీలో పెట్టిందన్నారు. ‘‘మంత్రుల వద్ద సమాచారం ఉంటే చెప్పాలి. అంతేగానీ సభ్యులు మాట్లాడొద్దనడం సరికాదు. మా సభ్యుడు తప్పు మాట్లాడితే అభ్యంతరం తెలపొచ్చు. ఆయన చెప్పింది అవాస్తవమైతే.. రూలింగ్‌ ఇవ్వాలి.’’ అని తెలిపారు. ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అంటే కోపం ఎందుకని అన్నారు. అయితే... వైసీపీ సభ్యుడు ఆనాడు.. అనే పదం వాడలేదని అధికారపక్ష సభ్యులు చెప్పారు. రికార్డులు చూద్దాం... అభ్యంతరకర మాటలుంటే ఏం చెప్తారంటూ వైసీపీ సభ్యులను సవాల్‌ చేశారు. అదే అంశంపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు, మంత్రి సబిత, టీడీపీ సభ్యులు శ్రీకాంత్‌, రాంగోపాల్‌రెడ్డి, అనురాధ, శ్రీకాంత్‌ తమ అభ్యంతరం తెలియజేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే రికార్డుల పరిశీలన కోసం సభను చైర్మన్‌ కొద్దిసేపు వాయిదా వేశారు. రికార్డులు చూశాక సభ్యుని మాటలు అభ్యంతరకరంగానే ఉన్నాయని, మరోసారి పూర్తిగా పరిశీలించి, రికార్డుల నుంచి తొలగిస్తామని తిరిగి సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ ప్రకటించారు. ఇంతటితో ఈ అంశాన్ని ముగిద్దాం అన్నారు. అనంతరం మంత్రి కేశవ్‌ చొరవతో మండలిలో సభ్యుల సత్ప్రవర్తన గురించిన చర్చ కొంతసేపు జరిగింది.

Updated Date - Sep 26 , 2025 | 05:41 AM