AP Govt: వాణిజ్యంలో అడ్డగోలుగా బదిలీలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:39 AM
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వివాదాస్పదంగా మారిన అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 220 మంది డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లను వారికి కేటాయించిన వ్యక్తిగత మార్కుల ఆధారంగా బదిలీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 350 మందికి స్థానచలనం
నిబంధనలకు విరుద్ధంగా పలువురు బదిలీ
నెలాఖరు, వచ్చే నెలలో రిటైరయ్యేవారూ..
మార్కులు, ర్యాంకింగ్‌ల ఆధారంగానే
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వివాదాస్పదంగా మారిన అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 220 మంది డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లను వారికి కేటాయించిన వ్యక్తిగత మార్కుల ఆధారంగా బదిలీ చేశారు. మరో 35 మంది జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా మార్కులు, ర్యాంకింగ్‌ల ఆధారంగా బదిలీ చేశారు. శాఖ ప్రధాన కమిషనర్(సీసీఎస్టీ) అహ్మద్ బాబు ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా వాణిజ్య పన్నుల శాఖలో 350 మంది అధికారులకు స్థానచలనం కలిగింది. క్షేత్రస్థాయిలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులను కూడా మా ర్కుల ప్రాతిపదికనే బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుకు సీసీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టి బదిలీలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏపీఎన్‌జీజీవో ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వచ్చే ఏడాది మే 31 లోపు పదవీ విరమణ చేసేవారిని బదిలీ చేయకూడదని పేర్కొంది. స్పౌజ్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మెడికల్ గ్రౌండ్స్‌లో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది.
అయితే ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా చాలా అన్యాయమైన పద్ధతిలో బదిలీలు చేశారంటూ పలువురు అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం సర్కిల్‌లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బడియా కామరాజు ఈ నెలాఖరునే పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయనను విశాఖపట్నానికి బదిలీ చేశారు. గుంటూరు అరండల్‌పేట సర్కిల్‌లో పని చేస్తున్న డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శాంతారామ్ వచ్చే నెలలో రిటైర్ కానుండగా.. ఆయనను పట్నంబజార్ సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇలా రెండు, మూడు నెలల్లో రిటైరవుతున్న అనేక మందిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు. గుంటూరు పట్నంబజార్ సర్కిల్‌లో పని చేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ను 9 నెలలు తిరక్కుండానే నంద్యాలకు బదిలీ చేశారు. ఆమె భర్త రాజమండ్రిలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. 4 నెలల క్రితమే వివాహమైన ఈ మహిళా అధికారి స్పౌజ్ కోటా కింద బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆమెను భర్తకు మరింత దూరంగా ఉండేలా నంద్యాలకు బదిలీ చేశారు.